హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోపాటు పలు ఇతర డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 34వ రోజుకు చేరుకుంది. ఇదిలావుండగా ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో తీర్పు వెల్లడించనుంది. హై కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందంటూ అటు కార్మిక సంఘాలు.. ఇటు ఆర్టీసీ యాజమాన్యం, తెలంగాణ సర్కార్ ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. కార్మికుల తరపున ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసి, ప్రభుత్వం తరఫున కోర్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ నేడు హైకోర్టు ఎదుట హాజరుకానున్నారు.
ఆర్టీసీ సమ్మెపైనే కాకుండా ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన మరో పిటిషన్ పైనా నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో హైకోర్టు ఏం చెప్పనుందా అనే ఉత్కంఠ అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంతో పాటు యావత్ ప్రజానికంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.