ఆర్టీసీ సమ్మె: విలీనం డిమాండ్‌పై హై కోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె: విలీనం డిమాండ్‌పై హై కోర్టు కీలక వ్యాఖ్యలు

Last Updated : Oct 28, 2019, 05:10 PM IST
ఆర్టీసీ సమ్మె: విలీనం డిమాండ్‌పై హై కోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె, కార్మికులతో చర్చలపై మధ్యాహ్నం తర్వాత హైకోర్టులో విచారణ జరిగింది. శనివారం కార్మికులతో జరిపిన చర్చలు మధ్యలోనే నిలిచిపోవడంపై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరపాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయని ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు వివరించారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదనీ, చర్చలు జరపకుండానే కార్మిక నేతలు బయటకు వెళ్లిపోయారని కోర్టుకు తెలిపారు. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు విన్న కోర్టు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌కు పట్టుబట్టకుండా మిగతా డిమాండ్లపై చర్చ జరపవచ్చు కదా అని హైకోర్టు సూచించింది. ప్రస్తుతానికి విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టి మిగతా వాటిపై చర్చ జరిపితే మేలు కదా అని కోర్టు అభిప్రాయపడింది. మొత్తం డిమాండ్లలో ఆర్టీసీ సంస్థపై ఆర్థికభారం పడని డిమాండ్లపై చర్చ జరిపి, ముందడుగు వేస్తే కార్మికుల్లో కొంత ఆత్మస్థైర్యం కలుగుతుందని హైకోర్టు పేర్కొంది. అలా కాకుండా సమ్మె విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగితే ఓవైపు కార్మికులు, మరోవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని కోర్టు స్పష్టంచేసింది. 

ఇదిలావుంటే, మరోవైపు కార్మిక సంఘాల జేఏసి తరపున న్యాయవాది ప్రకాశ్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చర్చల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆర్టీసీ అధికారులు తప్పుగా, వారికి అనుగుణంగా అన్వయించుకున్నారని అన్నారు. కేవలం 21 డిమాండ్లపైనే చర్చిస్తాం కానీ ఇతర డిమాండ్లపై చర్చించేందుకు సుముఖత వ్యక్తంచేయడం లేదని తెలిపారు.

Trending News