Bandi Sanjay Assembly Elections: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న సంజయ్.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి దిగాలని దాదాపుగా డిసైడ్ అయ్యారని బీజేపీ వర్గాల చెబుతున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆయన తెలంగాణలో అత్యంత సమస్యాత్మకంగా ప్రాంతంగా ఉన్న భైంసా పరిధిలో పోటీ చేయనున్నారని టాక్ వస్తోంది.
భైంసా మున్సిపాలిటీ ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటుంది. ముధోల్ నియోజకవర్గంలో భైంసాలో కీలక ప్రాంతం. దీంతో ముధోల్ నుంచి బండి సంజయ్ పోటీ చేయడం ఖాయమైందని బీజేపీ వర్గాల సమాచారం. బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్త గతంలో పోటీ చేసిన కరీంనగర్ లేదా వేములవాడ నుంచి పోటీ చేయవచ్చేనే ప్రచారం జరిగింది. కానీ ఆయన భైంసా నుంచి ఆయన పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
ముధోల్ నియోజకవర్గం సెన్సెటివ్ ప్రాంతం. భైంసాలో ముస్లిం ఓటర్లు ఎక్కువ. ఎంఐఎం పార్టీ బలంగా ఉంది. ఇక్కడ మత ఘర్షణలు ఎక్కువగా జరుగుతుంటాయి. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాకా భైంసా విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తున్నారు. దీంతో భైంసా పట్టణ బీజేపీ కార్యకర్తలతో పాటు ముధోల్ నియోజకవర్గం నేతలు బండి సంజయ్‌ను కలిసి ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరారట. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను ముధోల్ నుంచే ప్రారంభించారు బండి సంజయ్.
ఈ సందర్భంగానే మున్నూరు కాపు సంఘం నేతలంతా కలిసి సంజయ్‌ను తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరారట. కాపులతో పాటు ఇతర సంఘాల నేతలు కలిసి సంజయ్ పోటీ చేస్తే.. కుల, మతాలకతీతంగా మద్దతు ఇస్తామని, ప్రచారానికి రాకుండా లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.వాళ్ల ప్రతిపాదనకు బండి కూడా ఓకే చెప్పారని.. పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారని తెలుస్తోంది.
బండి సంజయ్ ముధోల్‌లో పోటీ చేయడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. ముధోల్‌లో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉంటే.. అందులో బండి సంజయ్ సామాజికవర్గమైన మున్నూరుకాపు ఓట్లు 50 వేల వరకు ఉన్నాయి. బండి భైంసాలో పోటీ చేస్తే ఇది కూడా ఆయనకు కలిసి రానుంది. సంజయ్ భైంసాలో పోటీ చేస్తే దాని ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని.. హిందువులంతా తమకు మద్దతుగా ఉంటారనే కమలం పార్టీ లెక్కలు వేసుకుంటుందని తెలుస్తోంది.
ముధోల్ నుంచి పోటీ చేయాలనే బండి సంజయ్ నిర్ణయంపై హైకమాండ్ కూడా సానుకూలంగా ఉందని చెబుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు యూపీలోని వారణాసిలో పోటీ చేశారు. మోడీ వారణాసిలో పోటీ చేయడం బీజేపీ హిందుత్వ నినాదానికి మరింత బలం చేకూర్చింది. అది దేశమంతా కనిపించింది. బీజేపీకి బంపర్ విక్టరీ దక్కింది. యూపీలో దాదాపుగా కమలం పార్టీ స్వీప్ చేసింది. అందుకే పోటీ చేసిన రెండు చోట్ల గెలిచిన మోదీ.. వారణాసి ఎంపీగా కొనసాగుతూ గుజరాత్ సీటును వదులుకున్నారు. మోదీ బాటలోనే బండి సంజయ్ భైంసా నుంచి పోటీ చేస్తే.. రాష్ట్రమంతా తమకు కలిసి వస్తుందనే భావనలో కమలం నేతలు ఉన్నారంటున్నారు.
ముధోల్ నుంచి ప్రస్తుతం విఠల్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2018లో ఆయన గెలిచారు. అయితే బలమైన నేత పోటీలో లేకపోవడం వలనే విఠల్ రెడ్డి గెలుస్తున్నారని స్థానిక బీజేపీ నాయకుల వాదన. బండి సంజయ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు. సంజయ్ పోటీ చేస్తే భైంసాలోని కొన్ని ముస్లిం వర్గాల మద్దతు కూడా సంజయ్‌కు దక్కుతుందని అంటున్నారు.
కోర్టు ఆదేశాలతో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భైంసాకు వెళ్లని బండి సంజయ్.. సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఉద్వేగంగా మాట్లాడారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భైంసా పేరును మైసాగా మారుస్తామని ప్రకటించారు. భైంసా బాధితులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామని, ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. బండి సంజయ్ ప్రసంగానికి అపూర్వ స్పందన వచ్చిందని బీజేపీ నేతలు అంటున్నారు. భైంసాలో బండి సంజయ్ పోటీ చేస్తే తమకు కచ్చితంగా కలిసివస్తుందని కమలనాథులు చెబుతున్నారు.
Also Read: Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన పథకంలో కీలక మార్పులు.. తప్పక తెలుసుకోండి
Also Read: Shraddha Murder Case: శ్రద్ధా ఫోన్ లోకేషన్ కనిపెట్టిన పోలీసులు.. ఆ విషయంపై నో క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bandi Sanjay: బండి సంజయ్ సంచలన నిర్ణయం.. వచ్చే ఎన్నికల్లో ఆ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ..?