Telangaan Floods: తెలంగాణలో వర్షాలు తగ్గాయి. గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలే నమోదయ్యాయి. కాని గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద ఊహించని స్థాయిలో వస్తుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులకు గతంలో ఎప్పుడు లేనంతగా వరద వస్తోంది. మహారాష్ట్ర నదులు ప్రాణహిత, ఇంద్రావతి ఉధృతంగా ప్రవాహిస్తున్నాయి. భూపాపల్లి జిల్లాలో ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కి ఊహించని రివర్స్ వరద వచ్చింది. లక్ష్మీ బ్యారేజీ కి ఇరు వైపులా గోదావరి ఉదృత్తంగా ప్రవహిస్తోంది. దిగువన వున్న ఇంద్రావతికి మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తోంది. ఇంద్రావతి నది ప్రవాహంతో మేడగడ్డ దగ్గర గోదావరి నీళ్లు రివర్స్ అవుతున్నాయి. కిందకు వెళ్ళలేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను ముంచేస్తోంది వరద. దీంతో లక్ష్మీ బ్యారేజీ కంట్రోల్ రూమ్ బిల్డింగ్ ను నలువైపులా నుంచి వరద వెళ్తోంది. కంట్రోల్ రూమ్ లో వున్న 90మంది పోలీసులు,10మంది ఇంజనీర్లు,15మంది సిబ్బంది వరద మధ్యలో చిక్కుకుపోయారు. ఇంతటి వరదను ఇరిగేషన్ శాఖ అధికారులు ఊహించలేకపోయారు. కంట్రోల్ రూమ్ దగ్గరకు జేసీబీలు కూడా వెళ్లలేకపోతున్నాయి. దీంతో కంట్రోల్ రూమ్ లోనే పోలీసులు, ఇరిగేషన్ సిబ్బంది ఉండిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నారు.
ప్రాణహిత ప్రవాహం తో కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి అంతకంతకు పెరిగిపోయింది. ఇంద్రావతి ప్రవాహంతో ములుగు జిల్లా రామన్నగూడెం వద్ద గోదావరి వరద ఉధృతి తీవ్రంగా ఉంది. అయితే ఎగువన వర్షాలు తగ్గడంతో గోదావరి నదికి వరద క్రమంగా తగ్గుతోంది. నిన్నటి కంటే ఉదయానికి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో తగ్గింది. గురువారం ఉదయం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 13 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వుండగా.. శుక్రవారం ఉదయం 5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. కడెం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు వరద తగ్గింది. కడెం ప్రాజెక్టుకు శుక్రవారం ఉదయం ఇన్ ఫ్లో కేవలం 22 వేల క్యూసెక్కులుగా ఉంది. శ్రీరామసాగర్ కు గురువారం ఐదు లక్షల క్యూసెక్కులపైగా వరద ఉండగా.. శుక్రవారం ఉదయానికి రెండు లక్షలకు తగ్గింది. క్రమంతా తగ్గుతూ వస్తోంది.
ఎగువ నుంచి వరద భారీగా తగ్గడంతో కాళేశ్వరం నుండి భద్రాచలం వరకు గోదావరి నదికి వరద ప్రవాహం క్రమంగా తగ్గనుంది. శనివారం సాయంత్రానికి భద్రాచలంలో నీటిమట్టం సాధారణ స్థితికి రావొచ్చని అంచనా వేస్తున్నారు. భద్రాచలం ముప్పు నుంచి బయటపడిందని అధికారులు అంటున్నారు. అయితే శుక్రవారం మళ్లీ భారీ వర్షాలు కురిస్తే మాత్రం గోదావరి మళ్లీ డేంజర్ లెవల్ కు చేరుతుందని చెబుతున్నారు.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook