హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. తాజాగా తెలంగాణ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి.. టీ సర్కార్‌పై పలు సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు టీ సర్కార్ స్కెచ్ వేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోలీసు శాఖలోనే సుశిక్షితులైన పోలీసులను ఉపయోగించుకుని తనను హత్య చేసేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు రచిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా పక్కా ప్రణాళిక ప్రకారం ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇప్పటికే మఫ్టీలో ఉన్న పోలీసులను కూడా రంగంలోకి దింపిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఏ క్షణమైనా తనపై దాడికి పాల్పడే అవకాశం లేకపోలేదని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలు చేశారు. తాను ఆధారాలు లేకుండానే ఇదంతా చెప్పడం లేదని, టీ సర్కార్ కుట్రకు సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉందని ఈ సందర్భంగా రేవంత్ స్పష్టంచేశారు.
తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. హైకోర్టు ఆదేశాల ప్రకారం తనకు భద్రత కల్పించకుండా తెలంగాణ సర్కార్ జాప్యం చేస్తుండటం కూడా అందులో భాగమేనని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.