కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు ఎవరనే విషయంలో గతంలో మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. అప్పుడు ఈటల చేసిన ఆ వ్యాఖ్యలు అనేక వేదికలపై చర్చకు దారితీయడమే కాకుండా అదో వివాదానికి కారణమయ్యాయి. ఆ తర్వాత తాజాగా మరో మంత్రి నోట టీఆర్ఎస్ పార్టీ ఓనర్‌షిప్ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు ఎవరనే విషయంలో కామెంట్ చేయడం ఈసారి సీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వంతయ్యింది. ''టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్‌దో, లేక కేటీఆర్‌దో కాదు'' అంటూ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు ఓనర్‌షిప్ వివాదాన్ని మరోసారి చర్చనియాంశమయ్యేలా చేశాయి. పార్టీలో కేసీఆర్ ఒక్కడే నాయకుడని, మిగతావాళ్లంతా కార్యకర్తలే అని వ్యాఖ్యానించిన గంగుల కమలాకర్... టీఆర్ఎస్‌కు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలే ఓనర్లని అభిప్రాయపడ్డారు. ఉద్యమకారులకు టీఆర్‌ఎస్ పార్టీ పదవులు ఇచ్చి గౌరవం ఇస్తుందని, బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తుందని అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కొనియాడారు. రైతుల పంటలకు భారీగా కనీస మద్ధతు ధర కల్పించడం, 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం, కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అన్నదాతకు ఏడాదికి మూడు పంటలకు నీరు అందించడం వంటివి సీఎం కేసీఆర్‌కే సాధ్యమయ్యాయని మంత్రి గంగుల చెప్పుకొచ్చారు.