YCP Vs Janasena: ఆ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్.. ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తానని వార్నింగ్

AP Politics: జనసేన ఎమ్మెల్యే... వైసీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధంతో ఆ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఆరోపణలే కాకుండా వచ్చే ఎన్నికల్లో  మెజారిటీపై కూడా అప్పుడే సవాళ్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆ రాజకీయ రగడలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు రావడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.‌  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 22, 2025, 10:33 PM IST
YCP Vs Janasena: ఆ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్.. ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తానని వార్నింగ్

AP Politics: సంక్రాంతి తర్వాత తూర్పుగోదావరి జిల్లా  రాజానగరం నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య తీవ్ర ఆరోపణలు.. సవాళ్లతో సార్వత్రిక ఎన్నికల నాటి పొలిటికల్ హీట్ మళ్లీ కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే రాజా సంక్రాంతి తర్వాత రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసి  కోడిపందాల నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే పది కోట్ల రూపాయలు వసూలు చేశారని.. నియోజకవర్గంలో తొలిసారిగా డ్రగ్స్.. రేవ్ పార్టీలు  ప్రవేశించేలా చేశారని ఫైర్ అయ్యారు. దీనిపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఘాటుగా స్పందించారు. గత ఐదేళ్లులో మాజీ ఎమ్మెల్యే సాగించిన కోట్లాది రూపాయల వసూళ్లు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగిపోవడంతో తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి కౌంటర్‌గా ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తానని మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. దీనికి సవాల్‌గా వచ్చే ఎన్నికల్లో  జక్కంపూడి రాజాను తానైతే 50 వేల మెజార్టీతో ఓడిస్తానని ఎమ్మెల్యే బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి ఛాలెంజ్ చేశారు. పొలిటికల్ హీట్ నేపథ్యంలో ఇరు వర్గాలు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌తో సైతం ఇక్కడ వార్ జరుగుతోంది.  

గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వర్గీయుడిగా ఉండేవారు. కోరుకొండ మండలం గాదరాడలో ఆధ్యాత్మికవేత్తగా కార్యక్రమాలు నిర్వహించారు. బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి వైసీపీ నుంచే ఎంపీటీసీగా గెలుపొందారు. అయితే అప్పట్లో ఎమ్మెల్యే రాజాతో తీవ్రమైన విభేదాలతో బత్తుల బలరామకృష్ణ వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఎన్నికల సమయంలో పార్టీ నుంచి పోటీ చేసిన 21 మంది అభ్యర్థుల్లో మొదట రాజనగరం నుంచి బత్తుల పేరునే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆర్థిక బలంతో పాటు రాజనగరంలో టీడీపీ, బీజేపీతో పొత్తు కలిసి రావడంతో 33 వేల ఓట్లకు పైగా మెజారిటీతో బత్తుల ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇదిలా ఉంటే గత ఏడు నెలలుగా తూర్పుగోదావరి జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలు..  వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు గత ఐదేళ్లలో తమ మధ్య రాజకీయ వైరాన్ని పక్కన పెట్టినట్లుగా రాజకీయాలు కనిపిస్తున్నాయి. అయితే రాజనగరంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడితో ఎమ్మెల్యే బత్తుల రాజకీయ వైరం ఏడాది గడవకుండానే మళ్లీ కాక పుట్టిస్తోంది. 
 
మరోవైపు ఇద్దరి నేతల మధ్య రాజకీయ రగడలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు రావడంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రాజానగరం ఎమ్మెల్యే వ్యవహారాలను ఆధారాలతో సహా నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు పంపిస్తానంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. అయితే తాను ఎలాంటి వాడినో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలుసు అని ఎమ్మెల్యే బత్తుల స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు సోషల్ మీడియాలో చేసుకుంటు విమర్శల్లో... జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా కనిపిస్తుంది.‌ ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి మరి.  

Also Read: Amitabh Bachchan: రియల్‌ ఎస్టేట్‌ అంటే ఇదే! రూ.31 కోట్ల ఆస్తిని రూ.83 కోట్లకు అమ్మిన అమితాబ్‌ బచ్చన్‌

Also Read: Jalgaon Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మందికి పైగా దుర్మరణం.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News