మెదక్ జిల్లా ఆంధోల్ మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. తన మనసులోని బాధను పంచుకుంటున్నానని తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను సంప్రదించకుండా.. వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల తాను మోసపోయానన్న భావన కలుగుతుందని ఆయన అన్నారు. అయితే తాను కేసీఆర్ పాలన మీద నమ్మకంతోటే.. ఆయనపైనున్న ఇష్టం వల్లే రాజకీయాల్లోకి వచ్చానని.. ఆయన దారే తన దారని తెలిపారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నా కూడా.. స్థానికుడి కోటాలో మరొకరికి టికెట్ ఇవ్వడంతో తాను ఆశ్చర్యపోయానని బాబూ మోహన్ తెలిపారు.
అయినా కేసీఆర్ తనకు గాడ్ ఫాదర్ లాంటి వారని బాబూ మోహన్ వివరణ ఇచ్చారు. అయితే తాను అంతగా ఆరాధించే నాయకుడి వల్లే తాను నడిరోడ్డు మీదకు రావాల్సి వచ్చిందనే బాధ, ఆవేదన తనకు ఉన్నాయని.. ఇవి నిజాయతీతో అంటున్న మాటలు అని తెలిపారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తనకు మచ్చ లేని నాయకుడనే పేరు మాత్రం వచ్చిందని.. తన జీవితానికి అది చాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను ఎన్నడూ పార్టీ టికెట్ కోసం ప్రగతి భవన్ చుట్టూ తిరగలేదని.. నిజాయతీతో కూడిన తన రాజకీయ జీవితాన్ని చూసే బీజేపీ తనను పార్టీలోకి ఆహ్వానించిందని.. అందుకే ఆ పార్టీలో చేరానని బాబూ మోహన్ వివరణ ఇచ్చారు. బీజేపీ పార్టీ తరఫున మళ్లీ ఆంధోల్ నుండి పోటీ చేయనున్నట్లు బాబూ మోహన్ ప్రకటించారు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజక వర్గం నుంచి టీడీపీ శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసిన బాబూ మోహన్ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు.