Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

Accounts Hack: తెలంగాణలో మరోసారి సైబర్‌ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ప్రజల బ్యాంక్‌ ఖాతాలు, సామాజిక మాధ్యమాల ఖాతాలను హ్యాకింగ్‌ చేస్తున్న ఆగంతకులు తాజాగా ప్రజాప్రతినిధులపై పడ్డారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారి ఖాతాలను హ్యాక్‌ చేస్తూ సంచలనం రేపుతున్నారు. మొన్న మంత్రి, నిన్న గవర్నర్‌, కల్వకుంట్ల కవిత ఖాతాలు హ్యాక్‌కు గురయ్యాయి.

Last Updated : Jan 18, 2024, 03:27 PM IST
Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

Social Accounts Hacking: మొన్నటి దాకా డీప్‌ ఫేక్‌తో ప్రముఖులు చిక్కుకోగా.. తాజాగా హ్యాకింగ్‌ నేరగాళ్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో మొన్న మంత్రి దామోదర రాజనర్సింహ, నిన్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిక్కుకున్నారు. రోజురోజుకు సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తమదైన తెలివితో వారి అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాలను హ్యాక్‌ చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఫేసుబుక్‌ ఖాతాలోనైతే ఇతర పార్టీల పోస్టులను అప్‌లోడ్‌ చేశారు. తన ప్రమేయం లేకుండా ఇలా జరుగుతుండడంతో ఆందోళన చెందిన మంత్రి రాజనర్సింహ వెంటనే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక ఈనెల 17న ఒకేరోజు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత 'ఎక్స్‌' (ట్విటర్‌) ఖాతాలు హ్యాక్‌ అయ్యాయి. కొద్దిసేపు పాటు ఆ ఖాతాలు పని చేయలేదు. ఖాతా తెరిచేందుకు ప్రయత్నించగా పాస్‌వర్డ్‌ తప్పు అని చూపించిందని గవర్నర్‌ కార్యాలయం తెలిపింది. తమకు సంబంధం లేని పోస్టులు, ఫొటోలు కనిపించడంతో ఖాతా హ్యాకయినట్టు గుర్తించినట్లు రాజ్‌ భవన్‌ వర్గాలు తెలిపాయి. వెంటనే రాజ్‌ భవన్‌ అధికారులు సైబర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక కవిత ఖాతా విషయంలోనూ ఇదే జరిగింది. తన ఖాతాల హ్యాకింగ్‌పై సామాజిక మాధ్యమాల ద్వారా కవిత సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలో కూడా పలువురు రాజకీయ ప్రముఖుల ఖాతాలు హ్యాక్‌ అయిన సంఘటనలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, నాటి మంత్రి కేటీఆర్‌, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తదితరుల ఖాతాలు కూడా హ్యాకయిన విషయం తెలిసిందే. ఈ హ్యాకింగ్‌ అంశం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య తీవ్ర వివాదానికి దారితీశాయి కూడా. ప్రత్యర్థుల తమను తప్పుదోవ పట్టించుకోవడానికి ఇలా చేస్తున్నారని విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. 

పోలీసుల ప్రత్యేక దృష్టి
ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోతుండడంతో సైబర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. మంత్రి రాజనర్సింహ, గవర్నర్‌ తమిళిసై, ఎమ్మెల్సీ కవితల ఫిర్యాదులను పరిశీలించారు. హ్యాక్‌ చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. గతంలో, ప్రస్తుతం హ్యాకింగ్‌ చేస్తుండడంతో దీన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. హ్యాకర్ల ఆటకట్టించేందుకు సిద్ధమయ్యారు. ఐపీ అడ్రస్‌లు కనుక్కునే పనిలో పడ్డారు. అయితే హ్యాకింగ్‌ సరదాకు చేస్తున్నారా? లేదా వారి వెనుక ఎవరైనా అసాంఘిక శక్తులు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. పటిష్ట భద్రత కలిగే వారి ఖాతాలే హ్యాక్‌ అవుతుండడంతో పోలీసులను కలవరపరుస్తోంది. త్వరలోనే నిందితులను పట్టుకుని హ్యాకర్ల ఆట పట్టిస్తామని సైబర్‌ పోలీసులు చెబుతున్నారు.

సరదాగా లేదా అసాంఘిక శక్తులా?
హ్యాకింగ్‌ అనేది విదేశాల్లో ఒక వృత్తి. మనదేశంలో కూడా హ్యాకింగ్‌పై ఆసక్తి మొదలైంది. కానీ హ్యాకింగ్‌ చేయడం చట్టరీత్యా నేరం. కానీ పోలీస్‌ విభాగాల్లో హ్యాకింగ్‌ అనేది తప్పనిసరి. ప్రజా క్షేమం కోరి హ్యాకింగ్‌ చేస్తారు. ఈ హ్యాకింగ్‌ నేర్పించడానికి కొన్ని ప్రత్యేక శిక్షణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆ సంస్థలకు పోలీసులు ముందే కఠిన నిబంధనలు విధించారు. ప్రజా అవసరాల కోసం మినహా అసాంఘిక కార్యక్రమాలకు హ్యాకింగ్‌ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ అలా హ్యాకింగ్‌ నేర్చుకున్న వారు ఇలా ప్రముఖుల ఖాతాలు హ్యాకింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. హ్యాకర్ల దాడి ఎక్కువైతే పోలీసు అధికారులు శిక్షణ కేంద్రాలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Also Read Telangana Davos Summit: తెలంగాణకు పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.37 వేల కోట్లు రాక

Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News