Bandi Sanjay Kumar: హైదరాబాద్: కొందరు వ్యక్తుల కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం జి.ఓలు జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తమకు నచ్చినట్టుగా కొందరు వ్యక్తుల కోసం ఏకంగా జీవోలు జారీ చేయడం అనేది ప్రభుత్వం దిగజారుడుతనానికి ఓ నిదర్శనం అని ఆయన తెలంగాణ సర్కార్‌పై ( Telangana govt ) మండిపడ్డారు. వైన్స్ కోసం కూడా ప్రత్యేక జీవోలు జారీ చేయడం అనేది కేవలం తెరాస ప్రభుత్వం మాత్రమే సాధించిన ఘనత అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
రహస్య జీవోలకు లెక్కేలేదు..
సీనియర్ లెక్చరర్, ఎక్సైజ్ సిఐల కొనసాగింపు కోసం జీవోలు జారీ చేయడం ఏంటని ఆయన నిలదీశారు. ఇప్పటికే రహస్యంగా జారీ చేసిన జి.ఓలకు లెక్క లేదు. మరోవైపు జారీ చేయాలనుకుంటున్న వాటికి అంతు లేదు. అందుకే ప్రభుత్వం చేస్తున్న ఈ మోసాన్ని ఇకనైనా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పునరాలోచించుకోవాలని హితవు పలికారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా వారి సంక్షేమాన్ని గాలికొదిలేసి.. రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారడం దురదృష్టకరం అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే డాక్టర్లకు కరోనా...
డాక్టర్లకు పి.పి.ఈ కిట్లు, ఎన్-95 మాస్కులు పంపిణి చేయకపోవడం వల్లనే డాక్టర్లకు కరోనా వైరస్ సోకిందని.. బీజేపీ ఎంత చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి పట్టిందని బండి సంజయ్ ఆరోపించారు. కరోనా పేషెంట్స్‌ని కాపాడుతున్న వైద్యులను కాపాడలేని ఈ ప్రభుత్వం సామాన్యులను ఎం కాపాడుతుందని నిలదీశారు. ఒకవేళ మీకు చేతగాకపోతే చెప్పండి. కోవిద్ ఆసుపత్రుల్లోని డాక్టర్లను మేమే కాపాడుకుంటామని అన్నారాయన. రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనావైరస్‌ని నివారించడంలో తెలంగాణ సర్కార్ తీవ్రంగా విఫలమైందని బండి సంజయ్ మండిపడ్డారు.