"టీమిండియా బాగా ఆడుతున్నంత కాలం.. తనకు తానుగా చేసే వ్యక్తిగత స్కోర్లతో సంబంధం లేదని" కోహ్లీ అన్న మాటలు అక్షరాలా అబద్ధమని ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అన్నారు. ప్రతీ ఆటగాడి వ్యక్తిగత స్కోరు కూడా అతను ఆడే జట్టుకి లాభాన్ని తీసుకొస్తుందని.. కోహ్లీ మనసులో కూడా అదే ఉందని.. కాకపోతే ఆయన ఏమనుకుంటున్నారో అది చెప్పలేదని ఆండర్సన్ సెటైర్లు వేశారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆగస్టు 1 తేది నుండి బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే అయిదు టెస్టు మ్యాచ్‌ల సందర్భంగా ఆండర్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో ఇంగ్లాండ్ టూర్లో భాగంగా జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ కేవలం ఓవరాల్‌గా 134 పరుగులు మాత్రమే చేసి సరిపెట్టుకున్నారు.
కోహ్లీ కెరీర్లో అదే చెత్త పెర్ఫార్మెన్స్‌గా నమోదైంది. అయితే 2016లో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ పై ఆయన బదులు తీర్చుకున్నారు. 5 టెస్టులలో 655 పరుగులు చేసి, తన జట్టుకి విజయాన్ని అందించారు. అయితే తాజాగా ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. చిత్రమేంటంటే..ఆండర్సన్‌కి కూడా కోహ్లీపై మంచి బౌలింగ్ రికార్డే ఉంది. 2014 టూర్లో ఆరు ఇన్నింగ్స్‌లో నాలుగు సార్లు ఆయన కోహ్లీని ఔట్ చేశారు. అయితే 2016 టూర్ ఆండర్సన్‌కి కలిసి రాలేదనే చెప్పాలి. మూడు టెస్టుల్లో కేవలం నాలుగు వికెట్లే తీశారాయన.