ఆక్లాండ్: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సొంతం చేసుకుంది. 159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ముద్దాడింది. భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి మూడు టీ20ల సిరీస్‌ని 1-1తో సమం చేసింది. టీమిండియా కెప్టేన్ రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లో చేసిన 50 పరుగులు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. శిఖర్ ధావన్ 30, పంత్ 40, ధోనీ 20 పరుగులు చేశారు. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీసిన కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్ ఫలితాన్ని తేల్చే 3వ టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు ఒకవిధంగా ఆదిలోనే కష్టాల్లోపడింది. 8 ఓవర్లలో 50 పరుగులకే ఓపెనర్లు సహా 4 కీలక వికెట్లు కోల్పోయిన కివీస్‌ను గ్రాండ్‌హోమ్, టేలర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోర్ పెంచడంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో కృనాల్ పాండ్యా 3, ఖలీల్ అహ్మద్ 2, భువనేశ్వర్, హార్దిక్ చెరో వికెట్ పడగొట్టారు.