కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం సాయంత్రం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో కోల్‌కతా జట్టుపై పంజాబ్ జట్టు విజయం సాధించింది.
తొలుత పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా జట్టు బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది. అనంతరం 192 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ.. జట్టు స్కోరులో వేగాన్ని పెంచారు. పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసే సమయంలో 8.2 ఓవర్ లో 97 పరుగుల వద్ద వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం, పంజాబ్ జట్టు లక్ష్యాన్ని 13 ఓవర్లు, 125 పరుగులకి కుదించారు. అప్పటికే 97 పరుగులు చేసిన పంజాబ్ జట్టు 11.1 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 126 పరుగులు చేయగలిగింది. దీంతో కోల్‌కతాపై పంజాబ్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కింగ్స్ ఓపెనర్లు కేఎల్ రాహుల్- 60, క్రిస్ గేల్- 62 (నాటౌట్) పరుగులు చేశారు. గేల్-రాహుల్ జోడి 9.4 ఓవర్లలో 116 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఇక మయాంక్ అగర్వాల్‌తో కలిసి గేల్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. విన్నింగ్ షాట్‌ను గేల్ సిక్స్ కొట్టడంతో కింగ్స్ పంజాబ్ జట్టు విజయం సాధించింది.