ఇంగ్లాండ్‌తో 5వ టెస్టులో.. తెలుగు క్రికెటర్

భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఆఖరి టెస్టులో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి చోటు దక్కడం విశేషం. 

Last Updated : Sep 7, 2018, 06:27 PM IST
ఇంగ్లాండ్‌తో 5వ టెస్టులో.. తెలుగు క్రికెటర్

భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఆఖరి టెస్టులో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి చోటు దక్కడం విశేషం. హార్దిక్ పాండ్య స్థానంలో జట్టులోకి వచ్చిన హనుమ విహారి.. భారత్ తరఫున ఈసారి టెస్టుల్లో ఆడడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడుతున్నారు. అలాగే హైదరాబాద్ జట్టు నుండే ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా హనుమ విహారి ఎంపిక కావడం విశేషం.

గత కొన్ని సంవత్సరాలుగా భారత్-ఎ జట్టులో కూడా మంచి ప్రదర్శనను కనబర్చిన హనుమ విహారిని టెస్టు జట్టులో కూడా ఆడేందుకు అవకాశం కల్పించారు సెలెక్టర్లు. ఇప్పటికి తన కెరీర్‌లో 63 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 56 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడిన హనుమ విహారి.. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ట్రిపుల్ సెంచరీ కూడా చేశారు. 2013, 2015 ప్రాంతాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున కూడా ఆయన ఐపీఎల్‌లో ఆడడం జరిగింది.

13 అక్టోబరు 1993లో కాకినాడలో జన్మించిన హనుమ విహారి.. 2012లో భారత్ గెలిచిన అండర్ 19 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు కూడా. అయితే ఈసారి టెస్టుకి హనుమ విహారిని ఎంపిక చేయడం పట్ల మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సునీల్ గవాస్కర్ కినుక వహించారు. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్‌ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తనకు హనుమ విహారి మీద ఎలాంటి కోపం లేదని.. తాను బాగా ఆడాలని తాను కోరుకుంటున్నానని.. కానీ కరుణ్ నాయర్ వంటి మంచి బ్యాట్స్‌మన్‌కి ఆఖరి టెస్టులో చోటు దక్కకపోవడం తనకు బాధ కలిగించిందని సునీల్ గవాస్కర్ తెలిపారు.

Trending News