బ్రిస్టోల్: మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు చెరొక మ్యాచ్ గెలవగా.. ఇవాళ గెలిచే జట్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంటుంది. ఈ నిర్ణాయక మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టి20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని విరాట్ కోహ్లి బృందం ఉంది. ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ఇంగ్లండ్ కూడా సిరీస్‌పై కన్నేసింది. వరుసగా ఏడు టీ20లు గెలిచిన భారత్.. ఎనిమిదో టీ20 కూడా గెలిచి అజేయంగా నిలవాలని కోరుకుంటోంది.
అయితే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లపైనే ఒత్తిడి ఉంది. స్పిన్నర్ కుల్దిప్ యాదవ్, స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌కు ఈ మ్యాచ్ పరీక్షే. భారత్ బ్యాటింగ్ పరవాలేదనిపించినా.. బౌలింగ్ కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో బౌలర్లు వైవిధ్యంపై దృష్టిసారిస్తేనే ఫలితాలు రాబట్టుకోవచ్చు. మరోవైపు ఇంగ్లండ్ అన్ని రంగాల్లో రాణిస్తూ మంచి ఊపు మీద ఉన్నది.
ఇరు జట్లు ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అయితే రెండు మ్యాచ్‌లలో విఫలమైన రూట్‌ను పక్కనపెట్టి స్టోక్స్‌ను ఇంగ్లాండ్ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
పిచ్, వాతావరణం: ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వేసవికాలం కాబట్టి వర్షం పడే అవకాశం లేదు. పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలిస్తుంది. స్పిన్నర్లకు ఇది సవాలే!
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, రైనా, ధోని, పాండ్యా, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, బట్లర్, హేల్స్, రూట్/స్టోక్స్, బెయిర్‌స్టో, విల్లీ, ప్లంకెట్, జోర్డాన్, రషీద్, జేక్ బాల్.