ఆసియా క్రీడల్లో పాక్ పై భారత్ గెలుపు.. కాంస్యం గెలుచుకున్న పురుషుల హాకీ జట్టు

ఆసియా క్రీడల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయాన్ని నమోదు చేసిన భారత్ హాకీ జట్టు ఎట్టకేలకు కాంస్యంతో సరిపెట్టుకుంది.

Last Updated : Sep 2, 2018, 02:03 PM IST
ఆసియా క్రీడల్లో పాక్ పై భారత్ గెలుపు.. కాంస్యం గెలుచుకున్న పురుషుల హాకీ జట్టు

ఆసియా క్రీడల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయాన్ని నమోదు చేసిన భారత్ హాకీ జట్టు ఎట్టకేలకు కాంస్యంతో సరిపెట్టుకుంది. శనివారం పాక్ పురుషుల హాకీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ హాకీ జట్టు 3-1 తేడాతో విజయం సాధించడం విశేషం. భారత హాకీ జట్టులో ఆకాశ్ దీప్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ గేమ్‌లో ముఖ్య పాత్ర పోషించారు. ఈ సంవత్సరం ఆసియా క్రీడల్లో పురుషుల జట్టు కాంస్యంతో సరిపెట్టుకోగా.. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లో జపాన్ చేతిలో 1-2 తేడాతో ఓడి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

పురుషుల జట్టు విషయానికి మలేసియాతో జరిగిన సెమీఫైనల్లో పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు పాకిస్థాన్ జపాన్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలవ్వడంతో కాంస్యం కోసం జరిగిన పోరులో భారత్‌తో తలపడింది. ఇక పురుషుల ఫైనల్స్ విషయానికి వస్తే తొలిసారిగా ఆసియా క్రీడల్లో మలేసియా, జపాన్ పురుషుల హాకీ జట్లు పసిడి పతకం కోసం బరిలోకి దిగనున్నాయి. 

ఇక పురుషుల, మహిళల రెండు విభాగాల్లో కూడా ఫైనల్స్ చేరిన జపాన్ ఇప్పటికే మహిళల విభాగంలో తొలిసారిగా స్వర్ణం గెలిచి చరిత్రను తిరగరాసింది. హాకీ జట్టు గెలిచిన కాంస్యంతో భారత్ పతకాల సంఖ్య 69కి చేరింది. ఇందులో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్య పతకాలు ఉన్నాయి. మూడు రోజుల నుండి పతకాల పట్టికలో భారత్ 8వ స్థానంలో కొనసాగుతోంది. కాగా చైనా అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. చైనా ఖాతాలో ప్రస్తుతం 129 పసిడి, 89 రజతాలు, 65 కాంస్యాలు ఉన్నాయి. 

Trending News