ఒబామా తీయబోయే సినిమాకి దర్శకత్వం వహించేది.. ఓ ఇండియన్ అమ్మాయి?

మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సతీమణి మిఛెల్ ఒబామాతో కలిసి పలు చిత్రాలను నిర్మించడం కోసం తమ సొంత నెట్ ఫ్లిక్స్ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభిస్తున్నారు. 

Last Updated : Aug 4, 2018, 10:08 PM IST
ఒబామా తీయబోయే సినిమాకి దర్శకత్వం వహించేది.. ఓ ఇండియన్ అమ్మాయి?

మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సతీమణి మిఛెల్ ఒబామాతో కలిసి పలు చిత్రాలను నిర్మించడం కోసం తమ సొంత నెట్ ఫ్లిక్స్ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభిస్తున్నారు. ఆ ప్రొడక్షన్ కంపెనీ ఇప్పటికే దర్శకుల వేటలో పడింది. అయితే ఈ దర్శకుల్లో ఓ భారతీయ మహిళా దర్శకురాలికి కూడా అవకాశం దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ఒబామా దంపతులు తీయబోయే ఓ చిత్రానికి సామాజిక వేత్త, దర్శకురాలు ప్రియా స్వామినాథన్ సైన్ చేశారట.

ప్రియ గతంలో న్యూయార్క్ నగరంలో వ్యభిచార ఊబిలో చిక్కుకుపోతున్న టీనేజ్ అమ్మాయిల కథలను ప్రేరణగా తీసుకొని "వేరీ యంగ్ గర్ల్స్" అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం ప్రియకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు తీసుకువచ్చింది. ప్రియా స్వామినాథన్ గతంలో మై నేమ్ ఈజ్ ఖాన్, హమ్ తుమ్ ఔర్ ఘోస్ట్, డీ ధనాదన్ లాంటి బాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ కూడా అందించారు. అలాగే "ఆపరేషన్ ఫిల్మ్ మేకర్" అనే చిత్రానికి అసిస్టెంట్ ఎడిటర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ది క్లిక్ ఎఫెక్ట్, ది ఫోర్త్ డైమెన్షన్ అనే చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 

అయితే ఒబామా దంపతులు టేకప్ చేస్తున్న ప్రాజెక్టులో ప్రియ స్వామినాథన్ ఎలాంటి బాధ్యతలు తీసుకుంటారన్న విషయం మీద ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. ఆమె గతంలో విజువల్ ఎఫెక్ట్స్ రంగంతో పాటు ఎడిటింగ్ రంగంలో కూడా పనిచేశారు కాబట్టి.. ఆ విధమైన బాధ్యతలు నిర్వర్తిస్తారా.. లేదా దర్శకురాలిగా లఘుచిత్రాలు, సినిమాలకు పనిచేస్తారా అన్న అంశంపై ఎలాంటి సమాచారం కూడా లేదు. గతంలో మహిళలపై లైంగిక వేధింపుల వంటి చర్యలను ప్రశ్నించేందుకు ప్రారంభమైన "టైమ్స్ అప్"ఉద్యమంలో కూడా ప్రియ చాలా యాక్టివ్‌గా పాల్గొన్నారు.

Trending News