మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల తల నరికి తన వద్దకు పట్టుకొస్తే రూ.5 లక్షలు బహుమతి ఇస్తానని బీజేపీ నేత సంజీవ్ మిశ్రా సంచలన ప్రకటన చేశారు. "బాలికలపై లైంగిక దాడికి పాల్పడేవారిని కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి. ప్రస్తుతం మాండ్సౌర్ ఘటనలో అత్యాచారానికి పాల్పడిన నిందితులకి ఉరిశిక్ష విధించమని కోర్టుని డిమాండ్ చేస్తున్నాను.
ఒకవేళ వారు ఆ శిక్షను విధించలేకపోతే.. అదే శిక్షను బయట వారెవరైనా అమలు చేయవచ్చు. ఆ రేపిస్టు తల నరికి నా వద్దకు తీసుకొస్తే.. రూ.5 లక్షల రూపాయలను బహుమతిగా ఇస్తానని ప్రకటిస్తున్నాను" అని బీజేపీ నేత బహిరంగ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన కేసును సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్) దర్యాప్తు చేస్తోంది.
కాగా, ఇదే కేసుకి సంబంధించి ఓ నిందితుడి తల్లి మాట్లాడుతూ.. తాను ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నానని డిమాండ్ చేయడం గమనార్హం. తన కుమారుడు నిర్దోషి అని.. అసలు నేరస్తులు వేరే ఉన్నారని ఆమె అంటున్నారు.
తన బిడ్డను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ఆమె వాపోతున్నారు. మాండ్సౌర్ కేసులో చిన్నారిని స్కూలు నుండి బలవంతంగా ఆమె ఇంటికి తీసుకొచ్చి మరీ అత్యాచారం చేశారని.. వారికి మరణ శిక్షను కోర్టు విధించాలని కోరుతున్నామని చిన్నారి తండ్రి డిమాండ్ చేస్తున్నారు.