తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరి జలాల పంపకం వివాదంలో శుక్రవారం ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. కావేరి వివాదం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న ప్రస్తుత తరుణంలో నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తమిళనాడు మధురైలోని మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో కొనసాగుతున్న కావేరి వివాదం త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉందంటూ కర్ణాటక సీఎం కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దేవుడి దయతో ఈ ఏడాది సరైన సమయంలో రుతుపవనాలు వచ్చాయి. పరిస్థితి ఇలాగే కొనసాగి సమృద్ధిగా వర్షాలు కురిస్తే.. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయంటూ కుమారస్వామి ఒకింత సానుకూల ధోరణిలో వ్యాఖ్యానించారు.
ఇప్పటికే కాబినీ డ్యామ్ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందిగా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించానని, తద్వారా కాబినీ డ్యామ్ కింద ఉన్న కర్ణాటక, తమిళనాడు రైతులకు మేలు జరగనుందని కుమారస్వామి తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక డ్యామ్‌లలో ఇన్‌ఫ్లో పెరిగింది. ఇకపై కావేరి జలాల పంపకం విషయంలో సాధ్యమైనంత వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు అని కుమారస్వామి స్పష్టంచేశారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే, తమిళనాడుకు రావాల్సి ఉన్న 10 టీఎంసీల నీరు తమిళనాడుకు విడుదల చేస్తామని అన్నారు.
Spoke to @CMofKarnataka . Expressed My pleasure on the opening of Kabini. Ultimately even after the Cauvery water management Authority starts functioning, only goodwill between the two States will open many more shut doors.
— Kamal Haasan (@ikamalhaasan) June 15, 2018
ఇదిలాఉంటే, కావేరి వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కాబినీ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాలి ఆ రాష్ట్ర అధికారులను ఆదేశించడం స్వాగతించదగిన పరిణామం అని సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధినేత కమల్ హసన్ అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్టయితేనే ఏ వివాదాలనైనా సులువుగా పరిష్కరించుకోవచ్చు అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.