న్యూఢిల్లీ: 2019 సాధారణ ఎన్నికల్లో మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ కురువృద్ధుడుగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ(82) కీలకం కాబోతున్నారన్న సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయ ఫ్రంట్ (థర్డ్ ఫ్రంట్/ఫెడరల్ ఫ్రంట్)కు ఆయనే సారథ్యం వహిస్తారని, మళ్లీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
వచ్చే నెల నాగపూర్‌లో జరిగే ఆరెస్సెస్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ప్రణబ్ ముఖర్జీ అంగీకరించడం.. గతకొద్ది రోజులుగా తెరవెనుక జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. తాజాగా ట్విటర్లో తననుతాను సిటిజన్ ముఖర్జీగా ప్రస్తావించుకోవడం.. ఈమేరకు కీలక సంకేతాలను వెలువరిస్తున్నాయి.
గత జనవరిలో భువనేశ్వర్‌లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో జరిగిన ఓ అనధికారిక సమావేశంలో ప్రణబ్‌కు ప్రత్యామ్నాయ బాధ్యతలను అప్పగించేందుకు తొలిసారి వ్యూహరచన జరిగినట్లు తెలిసింది. ప్రణబ్ ముఖర్జీ, దేవెగౌడ, వామపక్ష నేత సీతారాం ఏచూరి, బీజేపీ సీనియర్ నేత అద్వానీతో కలిసి భోజనం చేస్తున్న ఫొటోను నవీన్ పట్నాయక్ ట్వీట్టర్లో పోస్టు చేయడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి రేకెత్తించింది.
కొద్దినెలల ముందు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగానే.. నవీన్ పట్నాయక్‌కు రాష్ట్రపతి భవన్లో విందు ఇచ్చారు. అక్కడి నుంచే వారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడారు. బెంగాల్‌కు చెందిన దాదాకు, దీదీకి మధ్య ఆది నుంచీ మంచి సంబంధాలున్నాయన్న సంగతి తెలిసిందే. 2012లో రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ పేరును మొదటగా బలపరిచింది దీదీయే. ఆ తర్వాత శివసేన మద్దతు పలికింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని పదవికి ప్రణబ్ ముఖర్జీ ఒక్కరే అర్హులు అని బీజేడీ పార్లమెంటు సభ్యుడు ఒకరు బహిరంగంగా వ్యాఖ్యానించడం విశేషం.
2004లోనే ప్రధాని అవుతానని అనుకున్నానని, సోనియా తననే పీఎం చేస్తారని భావించానని, కానీ అనూహ్యంగా మన్మోహన్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపారని ఓ పుస్తకంలో ప్రణబ్ ప్రస్తావించిన విషయం విదితమే. ఇటీవల తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర రావుతో భేటీలోనూ ప్రధాని అభ్యర్థిగా ప్రణబ్‌ను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసింది తృణమూల్. ఫ్రంట్ వెనుక రహస్య అస్త్రమే ప్రణబ్ అని ఎన్డీటీవీ వర్గాలు విశ్లేషించాయి.