ట్యుటికొరిన్‌: స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ మూత.. రోడ్డున పడనున్న 50 వేల మంది ఉద్యోగులు

ప్రస్తుతం దేశంలో మూడు అతిపెద్ద రాగి పరిశ్రమల్లో వేదాంత లిమిటెడ్ యొక్క స్టెరిలైట్‌ రాగి కర్మాగారం ఒకటి.

Last Updated : May 29, 2018, 01:07 PM IST
ట్యుటికొరిన్‌: స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ మూత.. రోడ్డున పడనున్న 50 వేల మంది ఉద్యోగులు

తమిళనాడులోని ట్యుటికొరిన్‌లో వేదాంత లిమిటెడ్ యొక్క స్టెరిలైట్‌ రాగి కర్మాగారం మూసివేయాలని గతవారం స్థానికులు చేపట్టిన ఆందోళనల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. అన్నివైపుల నుంచి తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో కర్మాగారాన్ని మూసేయాలని నిర్ణయించింది. జల, వాయు కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వేదాంత స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది పళని స్వామి సర్కార్.
 

రోడ్డున పడనున్న 50వేల మంది ఉద్యోగులు

ఒకేచోట అతిపెద్ద రాగి ఉత్పత్తి యూనిట్‌ పెట్టిన కంపెనీగా ప్రంపంచంలోనే రికార్డుకెక్కిన వేదాంత గ్రూప్‌ స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని మూసేయాలని తీసుకున్న నిర్ణయం కారణంగా.. దానికి అనుబంధంగా ఉన్న 800 యూనిట్లపై ప్రభావం పడనుంది. ఫ్యాక్టరీ మూసేయడం వల్ల 50 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారని నివేదికలు తెలిపాయి.  

ఈ కర్మాగారంలో తయారు చేయబడిన రాగి దేశం యొక్క రాగి పరిశ్రమలో 40 శాతం వాటాను అందిస్తుంది. దేశంలో ఏటా మిలియన్ టన్నుల రాగి ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఫ్యాక్టరీ ఏడాదికి 4 లక్షల టన్నుల రాగిని ఉత్పత్తి చేస్తుంది. ఫ్యాక్టరీని మూసేయడం వల్ల రాగి ఉత్పత్తి క్షీణించి.. రాగికి డిమాండ్ పెరుగుతుంది. తద్వారా రాగి, దాని ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. వైండింగ్ వైర్ యూనిట్, ట్రాన్స్‌ఫార్మర్  తయారీ, కేబుల్ నిర్మాణంపై ప్రభావం ఉంటుంది.

దేశంలో మూడో అతిపెద్ద రాగి పరిశ్రమ

ప్రస్తుతం దేశంలో మూడు అతిపెద్ద రాగి పరిశ్రమల్లో ఇదొకటి. ఇండియన్ కాపర్ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, హిండాల్కో ఇండస్ట్రీస్ మూడు ప్రధాన కంపెనీలు. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ కేంద్ర సంస్థ. ఇక్కడ ప్రతి సంవత్సరం 99,500 టన్నుల రాగి ఉత్పత్తి జరుగుతుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం, హిందాల్కో ఇండస్ట్రీస్, స్టెరిలైట్ రాగి పరిశ్రమలు వరుసగా 5 లక్షల టన్నులు, 4 లక్షల టన్నుల రాగిని ఉత్పత్తి చేస్తున్నాయని పేర్కొంది. దేశంలోని మొత్తం రాగి ఉత్పత్తిలో 40 శాతం చైనాకు ఎగుమతి చేయబడుతోంది. ట్యుటికొరిన్‌ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమ మూత ప్రభావం వల్ల ఇప్పుడు వారందరూ రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది.

22 ఏళ్లుగా ఆందోళన

వేదాంత గ్రూప్‌నకు చెందిన స్టెరిలైట్‌ రాగి కర్మాగారం కారణంగా తీవ్రమైన కాలుష్య సమస్య ఉత్పన్నమవడంతో స్థానికులు 22 ఏళ్ల క్రితమే ఆందోళన బాటపట్టారు. మైనింగ్‌తో భూగర్భ జలాలు తగ్గుతాయని, ఉద్గారాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని.. వాటి కారణంగా క్యాన్సర్‌ వంటి రోగాలు ప్రబలుతున్నాయని తూత్తుకుడి వాసులు ఆందోళన చేస్తున్నారు. అయితే కంపెనీ యాజమాన్యం ప్రజాందోళనను పట్టించుకోకుండా ప్రభుత్వాలను మేనేజ్‌ చేస్తూ వచ్చింది. ఈనెల 22న ఆందోళన ఉగ్రరూపం దాల్చడంతో 13 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న రాగి కర్మాగారం ఎట్టకేలకు మూతపడింది.

Trending News