Sirivennela Last Song: సిరివెన్నెల. నిజంగానే అక్షరాల సిరులు కురిపించి..ఆ అక్షరాల్ని మన మనస్సుల్లో ఎప్పటికీ చెరగకుండా ముద్ర వేయించగలిగిన మహా రచయిత. ఆ పాట రాసేముందు చివరిపాటని ఎందుకన్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Sitarama sastry)తెలుగు సినిమాను వదిలి అనంతలోకాలకు పయనమైన సంగతి తెలిసిందే. అందర్నీ విషాదంలో ముంచేసిన సిరివెన్నెల నిష్క్రమణ నుంచి అభిమానులు ఇంకో కోలుకోలేకపోతున్నారు. తెలుగు భాషపై పట్టు ఎలాగూ ఉండనే ఉంది. పనిపై ఆయనకున్న శ్రద్ధ, బాధ్యత, నిబద్ధతకు అద్దం పట్టే ఓ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చనిపోయేవరకూ పాటలు రాస్తూనే ఉన్న సిరివెన్నెల నిజంగా అభినందనీయులు.
తెలుగు సినీ సాహిత్యానికి అద్భుతమైన పాటలతో వెలుగులందించిన మహనీయుడు. తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న సీతారామశాస్త్రి కలం నుంచి ఎప్పుడూ సిరుల్లాంటి అక్షరాలే రాలాయి. సాహిత్యం అంత అద్భుతంగా ఉంటుంది. పదాలు అంత అందంగా ఉంటాయి. ఆ పదాల భావం మైమరపిస్తుంది. నవంబర్ 30 వతేదీన కన్నుమూసిన సిరివెన్నెలకు తాను చనిపోతాననే విషయం ముందే తెలుసా అన్పిస్తోంది. తన మరణం గురించి ఓ నెల ముందే ఊహించగలిగారా అన్పిస్తుంది. ఎందుకంటే ఇదే తన చివరిపాటను ఆ దర్శకుడితో సిరివెన్నెల(Sirivennela)ఎలా అనగలిగారనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
నాని హీరో నటిస్తున్న శ్యామ సింగరాయ్ సినిమాలో సిరివెన్నెల చివరిపాట(Sirivennela last song)రాశారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరల విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై బోయనపల్లి వెంకట్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలోని సిరివెన్నెల అనే పాటను డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నారు. అదే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట. ఈ పాట గురించి చెబుతూ దర్శకుడు రాహుల్ అందించిన వివరాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
నవంబర్ 3 వతేదీ రాత్రి సిరివెన్నెల తనకు ఫోన్ చేసి..ఆరోగ్యం బాగాలేదని..పాట పూర్తి చేయలేనని..ఎవరితోనైనా రాయిద్దామని చెప్పినట్టు రాహుల్ వివరించారు. దానికి తను ఫర్లేదు సార్ అని అన్నానన్నారు. అయితే ఆ మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసి..పల్లవి పూర్తయింది..రాస్కో అంటూ చెబితే తాను రాసుకున్నానన్నారు. అద్భుతమైన ఆరులైన్లతో ఇచ్చిన పల్లవిలో తొలి లైన్లోనే సిరివెన్నెల అంటూ సంతకం చేయడం చూసి ఎందుకని అడిగానన్నారు. ఇదే నా చివరి పాట కావచ్చు నాన్నా అంటూ నవ్విన సంగతిని గుర్తు చేసుకున్నారు దర్శకుడు రాహుల్.
ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. పాటల పట్ల, వృత్తి పట్ల, పని పట్ల ఆయనకున్న బాధ్యతను, నిబద్ధతను ఇది స్పష్టం చేస్తుంది. త్వరలో విడుదలకు సిద్ఘంగా ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా దోస్తీ పాటను సిరివెన్నెల 2019లోనే రాశారు. అందుకే శ్యామ్ సింగరాయ్ సినిమాలో(Shyam Singharoy) పాటే ఆయన చివరిపాటగా మిగిలింది. అదే ఆయన చివరిపాటని ఆయనకు కూడా తెలిసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook