భారతదేశంలో 40కి పైగా భాషలు అంతరించిపోయే ప్రమాదంలో ఉందంటూ భారత జనగణన సంచార కార్యాలయం నివేదించింది. ప్రస్తుతం కొన్ని వేల మంది మాత్రమే ఈ భాషలు/ మాండలికాలు మాట్లాడుతున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
మన దేశంలో 22 షెడ్యుల్ భాషలు, 100-నాన్ షెడ్యుల్ భాషలు ఉన్నాయి. వీటిని కనీసం లక్ష..ఆపై ఎక్కువమంది మాట్లాడుతున్నారు. అయితే, మరో 40కి పైగా భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని, వీటిలో ఒక్కో భాషను 10 వేల కంటే ఎక్కువ మంది మాట్లాడటం లేదని హోం మంత్రిత్వశాఖ తెలిపింది. భారతదేశంలో 42 భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందంటూ యునెస్కో విడుదల చేసిన జాబితాను హోంశాఖ గుర్తుచేసింది.
అంతరించిపోయే భాషల/మాండలికాల జాబితాలో అండమాన్ నికోబార్ కు చెందిన 11 భాషలు, మణిపూర్ కు చెందిన ఏడు భాషలు, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన నాలుగు భాషలు, ఓడిశాకు చెందిన మూడు భాషలు, కర్నాటకకు చెందిన రెండు భాషలు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన గడబా, నైకీ భాషలు ఉన్నాయి. తమిళనాడు, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఒక్కో భాష అంతరించిపోయే ప్రమాదంలో ఉందని హోంశాఖ వర్గాలు తెలిపాయి.