గత కొంత కాలంగా ఇండియన్ రైల్వేలో అనేక ప్రయోగాలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. మార్చి 1వ తేదీ నుంచి రైలు బోగీలపై రిజర్వేషన్ చార్ట్ ని అంటించకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా జోనల్ రైల్వే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారిచేసింది రైల్వే శాఖ. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రయోగం ఆరు నెలలపాటు అమలులో వుండనుంది. ఏ1, ఏ, బీ కేటగిరీ రైల్వే స్టేషన్లలో ఈ ప్రయోగాన్ని అమలు చేయనున్నారు.
అయితే, మరి బోగీలపై రిజర్వేషన్ చార్ట్ లేకపోతే, ప్రయాణికుల రిజర్వేషన్ వివరాలు తెలిసేది ఎలా అని కంగారు పడకండి! ఎందుకంటే అదే రిజర్వేషన్ చార్టులని రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకి ప్రముఖంగా కనిపించే చోట ఆ చార్టులని అంటించాల్సిందిగా కేంద్రం స్పష్టంచేసింది. అంతేకాకుండా ప్లాస్మా డిస్‌ప్లే కలిగిన స్టేషన్లు ప్లాస్మాలో ఈ చార్టుని ప్రదర్శించాల్సిందిగాను రైల్వే శాఖ తమ ఆదేశాల్లో పేర్కొంది.
ఇప్పటికే ఈ ప్రయోగం న్యూ ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, హౌరా, సెల్డ స్టేషన్లలో మూడు నెలల పైలట్ ప్రాజెక్టు కింద అమలవుతోంది.
అలర్ట్: ఇకపై అక్కడ రిజర్వేషన్ చార్ట్ వుండదు