ప్రధాని నరేంద్ర మోదీ ..డ్రీమ్ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ లోని నర్మదా నదీ తీరంలో అతి ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం 'ది స్టాచ్యూ ఆఫ్ యునిటీ'ని ఆయన ప్రారంభించారు. ఇప్పుడు మరో డ్రీమ్ ప్రాజెక్టు రెడీ అయింది. అదే గుజరాత్ లోని అహ్మాదాబాద్ లో నిర్మించిన మొతెరా స్టేడియం. ప్రపంచంలోని అత్యంత పెద్ద స్టేడియం ఇదే కావడం విశేషం. ఇప్పుడు దీని విశేషాలు తెలుసుకుందాం.
మొతెరా స్టేడియం కూడా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ ఉపప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంగా నిర్మితమైంది. దీన్ని 1982లో నిర్మించారు. అప్పట్లో ఈ స్టేడియంలో 49 వేల మంది కూర్చునే విధంగా నిర్మించారు. ఈ స్టేడియంలో భారత, వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఐతే ఈ స్టేడియంను 2016లో మళ్లీ కొత్తగా నిర్మించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పనులు ప్రారంభమయ్యాయి.
మొత్తంగా 63 ఎకరాల స్థలాన్ని స్టేడియంను నిర్మించారు. ప్రస్తుతం ఈ స్టేడియంలో లక్షా 10 వేల మంది కూర్చుని క్రికెట్ మ్యాచ్‌ను అస్వాదించవచ్చు. మొత్తంగా ఇందులో 76 కార్పొరేట్ బాక్సులు ఉండడం విశేషం. 4 డ్రెస్సింగ్ రూమ్‌లు, ఒలింపిక్ సైజ్ లో స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించారు. ఇందులోనే 3 ప్రాక్టీస్ గ్రౌండ్‌లు ఉన్నాయి. ఇండోర్ క్రికెట్ అకాడెమీ కూడా నిర్మించారు. ఈ స్టేడియం చుట్టు పక్కల మొత్తంగా 3 వేల కార్లను 10 వేల ద్విచక్రవాహనాలను పార్కింగ్ చేసే విధంగా నిర్మించారు. ఒకేసారి 50 వేల మంది సాధారణ ప్రేక్షకులు 360 డిగ్రీల కోణంలో మ్యాచ్‌ను తిలకించవచ్చు.
ఇప్పటి వరకు అతి పెద్ద స్టేడియంగా.. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఆ స్టేడియంలో ఒకేసారి 90 వేల మంది కూర్చుని మ్యాచ్ చూడవచ్చు. ఇప్పుడు కొత్తగా విస్తరించిన మొతెరా స్టేడియం ఏకంగా లక్షా 10 వేల మంది ఒకేసారి క్రికెట్ చూసేలా ఏర్పాటు చేశారు. 1982లో నిర్మితమైనప్పటి నుంచి ఈ స్టేడియంలో 23 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. చివరి సారిగా డిసెంబర్ 2011 వరకు ఈ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది.
సర్దార్ పటేల్ స్టేడియంకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అప్పట్లో భారత క్రికెట్ కెప్టెన్ .. సచిన్ టెండూల్కర్ ఈ స్టేడియంలోనే టెస్ట్ క్రికెట్ లో 10 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు. అంతే కాదు న్యూజీలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలిసారి డబుల్ సెంచరీ చేయడం విశేషం. మరోవైపు భారత లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఇదే స్టేడియంలో టెస్ట్ మ్యాచుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. 1987లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ పరుగులు పూర్తి చేశారు. ఆ తర్వాత ఏడేళ్లకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇదే స్టేడియంలో 432వ వికెట్ తీసి ప్రపంచంలో అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచారు. అప్పట్లో రిచర్డ్ హ్యాడ్లీ పేరిట ఉన్న రికార్డును కపిల్ దేవ్ అధిగమించారు. అంతే కాదు 1983లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కపిల్ దేవ్ ఏకంగా 9 వికెట్లు ఈ గ్రౌండ్ లోనే సాధించారు.
ప్రస్తుతం మొతెరా స్టేడియం అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. 800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియంను ఈ నెల 24న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.