ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన ప్రకంపనలు సృష్టించడంతో దీనిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు కమిటీ ముందు ఆయన మరో ప్రతిపాదన ఉంచారు. తెలంగాణ ఉద్యమంలో ప్రసిద్ధి చెందిన నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా మలచుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశాన్ని త్వరగా పరిష్కరించేందుకు కొత్త ప్రతిపాదనను కమిటీ ముందుకు తీసుకొచ్చారు. నీళ్లు, నిధులు, పరిపాలన.. అందరికీ సమానం అనే ప్రతిపాదనను సూచించారు. దీని వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందనేది ఆయన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదనలు చేయడం విశేషం. దీని వల్ల కమిటీ రిపోర్టుపై ప్రభావం ఉంటుందా అనేది వేచి చూడాలి .
ఉద్యమం.. ఉద్ధృతం..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతుల ఉద్యమం నేటి నుంచి తీవ్రతరమైంది. నిన్నటి వరకు రైతుల ఉద్యమంగానే ఉన్న అమరావతి ఆందోళన నేటి నుంచి మరింత ఉద్ధృతమైంది. వ్యాపారులు, స్థానికులు కూడా పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేశారు. ఐతే అత్యవసరాలైన ఆస్పత్రులు, మందులు, పాల విక్రయ కేంద్రాలను మాత్రం తెరిచి ఉంచారు. ఉదయం నుంచే ఉద్యమకారులంతా ఆందోళనలు చేస్తున్నారు. తుళ్లూరులో వాహనాలు వెళ్లకుండా రోడ్లపై బైఠాయించారు.
రాజధాని రైతుల ప్రశ్నలు
మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని రాజధాని రైతులు విమర్శించారు. విశాఖ వాసులు రాజధాని కావాలని అడిగారా అంటూ ప్రశ్నించారు. బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ అనేది బోగస్ కంపెనీ అని .. ఆ కంపెనీ రిపోర్టు సీఎం జగన్ చెప్పిన విధంగానే ఉంటుందని విమర్శించారు. రాజధాని అమరావతి ఉద్యమానికి ప్రజా మద్దతు లేదంటున్న ప్రభుత్వం కళ్లుండీ చూడలేకపోతున్నట్లుగా ఉందన్నారు. రాజధాని తరలింపు అనేది జరిగితే తమ శవాల మీద నుంచి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. Read Also: అది జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఎకనామిక్ జోన్ మాత్రమే: ఏపీఎస్ ఆరోపణలు జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కొత్త రాగం