Telangana Govt Employees: ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. డీఏలు.. జీతాల పెంపుపై ఆందోళన బాట పట్టిన ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం స్నేహ హస్తం చాచింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రభుత్వం మనది అని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయదని స్పష్టం చేశారు. ఎవరి ఉచ్చులో చిక్కుకోవద్దని.. చిక్కుకుంటే మీకే నష్టమని హెచ్చరించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించలేమని కుండబద్దలు కొట్టారు.
Also Read: Kishan Reddy: 'రైతు భరోసాకు దరఖాస్తులతో రైతులకు రేవంత్ రెడ్డి మరో మోసం'
హైదరాబాద్‌లో ఉద్యోగులతో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కష్టకాలంలో బాధ్యతలు చేపట్టాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రత్యేక రాష్ట్రంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప అవకాశం మాకు ఇచ్చారు. మేం అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల మొదటి తారీఖు జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం' అని వివరించారు. 'ప్రభుత్వంపై ఆధారపడి ప్రజల కోసం పనిచేసే వారికి ప్రతీ నెలా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం. అక్కడక్కడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: K Kavitha: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన.. 'నేను చెప్పింది తప్పయితే రాజకీయాల నుంచి తప్పుకుంటా'
ప్రభుత్వ ఆదాయ వ్యయాలు
ఈ సందర్భంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వ్యయాలు ముఖ్యమంత్రి వివరించారు. 'ప్రతీ నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18,500 కోట్లు. ఇది ప్రభుత్వ అవసరాలకు సరిపోవడంలేదు. అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే రూ.30వేల కోట్లు కావాలి. వచ్చే ఆదాయంలో రూ.6500కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాం. మరో రూ.6,500 కోట్లు ప్రతీ నెల అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి. మిగిలిన 5500 కోట్లలో సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి. కనీస అవసరాలకు ప్రతీ నెల రూ.22,500 కోట్లు కావాలి. వచ్చిన ఆదాయంతో పోలిస్తే రూ.4000 కోట్లు తక్కువ పడుతోంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
'మేం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులే. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చాం. ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటాం. ప్రభుత్వ ఆదాయం ప్రతీ నెలా మరో రూ.4000 కోట్లు పెంచుకోవాలి' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
'ఈ ప్రభుత్వం మనది. ఆదాయాన్ని పెంచాలన్నా.. పెంచిన ఆదాయం పంచాలన్నా మీ చేతుల్లోనే ఉంది. మీ సమస్యలు చెప్పండి పరిష్కారానికి కార్యాచరణ చేపడతాం. ఈ ప్రభుత్వం మీ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తుంది' అని రేవంత్ రెడ్డి నిస్సహాయత వ్యక్తం చేశారు. 'సమస్యల పరిష్కారానికి మీరు ధర్నాలే చేయాల్సిన అవసరం లేదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
క్రమబద్దీకరించం
'రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారు. వారి ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది మీరే. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మాకు ఉన్నా చేయలేని పరిస్థితి. సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్. ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. అవకాశం లేకపోయినా రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మీ సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. 'మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. మిమ్మల్ని కష్టపెట్టి మీకు నష్టం కలిగే పనులు ప్రభుత్వం చేయదు' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook