Vijayawada Floods: భారీ వర్షాలతో నిండా మునిగిన విజయవాడ నగరాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నిమిషం పాటుపడుతున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉద్యోగులను పరుగులు పెట్టిస్తూనే ఆయన స్వయంగా సహాయ చర్యల్లో మునిగారు. వరుసగా మూడో రోజు కూడా ఆయన సహాయ చర్యలు చేపట్టారు. స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడి భరోసా ఇచ్చారు. వారికి ఆహారం, నిత్యావసర వస్తువులు ఇచ్చారు.
Also Read: Pawan Kalyan: పత్తా లేని పవన్ కల్యాణ్.. ఏపీ ఆపదలో ఉంటే సంబరాల్లో డిప్యూటీ సీఎం?
సహాయ చర్యలు పర్యవేక్షించిన అనంతరం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మంగళశారం మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బాధితులకు అందిస్తున్న సేవలు.. వరద పరిస్థితిపై వివరణ ఇచ్చారు. 'క్షేత్రస్థాయిలో వరద బాధితులందరికీ సహాయ సహకారాలు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. మూడు రోజులుగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాం' అని తెలిపారు.
Also Read: Vijayawada Floods: ఆపత్కాలంలో అండగా.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ విరాళాలు
'179 సచివాలయాల్లో ఒక్కో సచివాలయానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాం. వరద బాధితులకు వాహనాల్లో తీసుకెళ్లి అందిస్తున్నాం. చివరి ప్రాంతాలకు సైతం ఆహార పదార్థాలు అందించే విధంగా 32 మంది ఐఏఎస్ అధికారులను నియమించాం. పరిసర జిల్లాల నుంచి కూడా ఆహార పదార్థాలను తీసుకొచ్చి ప్రజలకు టిఫిన్, రెండు పూటలా భోజనం అందేలా చూస్తున్నాం. చిట్టచివరి వ్యక్తికీ ఆహారం చేరాలని ఆదేశాలు ఇచ్చాం' అని సీఎం చంద్రబాబు వివరించారు.
'అధికారులందరూ సమన్వయంతో మీకు కేటాయించిన ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలబడి మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించాలి. సహాయ చర్యలకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాం. ఆహార పదార్థాలు ఎక్కడా వృథా కాకుండా ఎక్కడపడితే అక్కడ కాకుండా ఆయా సచివాలయాల పరిధిలో సరైన విధంగా బాధితులకు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. వరద ప్రభావంతో ప్రజలు పడే బాధ వర్ణనాతీతం. పాములు, తేళ్లు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి నిబద్ధతతో సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది' అని అధికారులకు సీఎం చంద్రబాబు చెప్పారు.
'పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. ప్రజలు కూడా సంయమనం పాటించి సహకరించాలి' అని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు, విజ్ఞప్తుల కోసం మూడో నెంబర్‌ను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. జక్కంపూడిలో విధులు సక్రమంగా నిర్వహించని ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఎవరైనా తమ విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన బోట్లపై విచారణ చేయిస్తామని తెలిపారు. బాధితులకు సేవలు అందించే విషయంలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter