ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి తుపాకీ శబ్దాలతో దద్దరిల్లింది. ఈసారి సామాన్య ప్రజానీకంవైపు కాకుండా ఒక టీవీ ఛానెల్ లోకి చొరబడి గుర్తు తెలియని దుండగులు కాల్పులు సృష్టిస్తున్నారు. ఈ వార్త కొద్దిసేపటికే అంతర్జాతీయ ఛానళ్లలో ప్రసారం కావడంతో అక్కడ ఏమి జరుగుతుందో అని టెన్షన్ క్రియేట్ అయ్యింది. ప్రముఖ టీవీ చానెల్ షంషాద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా సాయుధులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మృతి చెందినట్టు కథనాలు కూడా వస్తున్నాయి.
భారీ ఆయుధాలతో కాల్పులు జరుపుతూ, గ్రానేట్ లను విసురుతూ చానెల్ కార్యాలయంలోకి చొరబడ్డారు. ప్రస్తుతం చానెల్ కార్యాలయ భవనంలో చాలామంది సిబ్బంది, ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. దుండగులు కొద్దిసేపటికోసారి కాల్పులు జరుపుతున్నారు. కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకొని గడుపుతున్నారని.. ఈ ఘటన నుంచి తప్పించుకున్న ఉద్యోగి ఒకరు మీడియాకు తెలిపారు. వందమందికిపైగా ఉద్యోగులు భవనంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందో తెలియరావడం లేదు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.