అమరావతి: కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిపోయి తానే సొంతంగా పార్టీ పెట్టి ప్రతిపక్ష నేతగా ఎదిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత తొమ్మిదేళ్లకు తాజాగా ఆ పార్టీపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో వైఎస్ జగన్ ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీని హృదయపూర్వకంగా క్షమించానని చెప్పడం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. కాంగ్రెస్ పార్టీపై తనకు ఎలాంటి ప్రతీకారం లేదని జగన్ తేల్చిచెప్పడం రాజకీయ పార్టీలను, రాజకీయ పరిశీలకులను ఆలోచనలో పడేసింది.
ఇదిలావుంటే, మరోవైపు తాము కేంద్రంలో అధికారంలోకొస్తే, ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ నోటి వెంట వచ్చిన ఈ హామీపై ఇప్పటివరకు ప్రత్యేకంగా స్పందించని జగన్ తాజాగా కాంగ్రెస్ పార్టీ గురించి స్పందించిన తీరు అనేక చర్చలకు తెరతీసింది.