హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఇవాళ అసెంబ్లీ సమావేశం కానుంది. నేటి నుంచి 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ శాసనసభ్యుడు ముంతాజ్ అహ్మెద్ ఖాన్ అధ్యక్షతన వహించనున్నారు. ఉదయం 11 గంటలకు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రమాణం చేయించనున్నారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత మహిళా సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇదిలావుంటే, స్పీకర్‌గా పోటీచేయాలనుకొనే సభ్యులు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఓ నోటిఫికేషన్ జారీచేశారు. ఇవాళ నామినేషన్ల దాఖలు, రేపు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఒకటికి మించి ఎక్కువ నామినేషన్స్ దాఖలు కాని పక్షంలో వారినే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ అభ్యర్థి ఎంపికను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాల్సిందిగా కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ చీఫ్ లక్ష్మణ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇక స్పీకర్ అభ్యర్థిత్వంపై సీఎం కేసీఆర్ నేడు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
ఆనవాయితీ ప్రకారమే గవర్నర్ నరసింహన్ 19న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనుండగా 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, కౌన్సిల్లో వేర్వేరుగా చర్చ జరగనుంది. ఈ చర్చను అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రారంభిస్తారు. ప్రశాంత్ రెడ్డి తదితరులు మాట్లాడుతారని తెలిసింది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీ, కౌన్సిల్ ధనవ్యాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నాయి.