ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన తర్వాత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన నేతలు, పోలీసులు, కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. కిడారి, సోమ హత్యల అనంతరం ఆంధ్రాతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిషా, చత్తీస్‌ఘడ్‌లోనూ పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ జంట హత్యల షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే, తాజాగా ఒడిషాలోని గంజాం జిల్లా దర్పంగలో ప్రత్యక్షమైన ఓ బ్యానర్ మరోసారి మావోల కదలికలపై కలకలం రేపింది.
ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు పోలీసులకు సమాచారం అందిస్తున్న ఇన్ఫార్మర్లను హతమారుస్తామంటూ ఒడిషాలో మావోయిస్టుల పేరిట వెలిసిన ఓ బ్యానర్ కలకలం రేపుతోంది. గంజా జిల్లా ఎస్పీ బ్రిజేశ్‌కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చేతితో రాసిన ఈ బ్యానర్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనే విషయాన్ని స్పష్టం చేయనప్పటికీ, గంజాం, కోంధమాల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలుగా మాత్రం పేర్కొన్నట్టు తెలిపారు. అయితే, ఈ బ్యానర్ ఏర్పాటు చేసిన మావోయిస్టుల ఏ దళానికి చెందిన వారు అనే వివరాలు మాత్రం స్పష్టంచేయలేదు. అంతేకాకుండా మావోయిస్టుల పేరిట సంఘ విద్రోహశక్తులు సైతం నేతలను భయబ్రాంతులకు గురిచేసేందుకు ఈ విధంగా బ్యానర్ ఏర్పాటు చేసి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని, ఆ కోణంలోనూ ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఏదేమైనా.. మావోయిస్టుల పేరిట వెలిసిన ఈ బ్యానర్.. ఆ రెండు జిల్లాల్లోని నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందంటున్నాయి అక్కడి రాజకీయవర్గాలు.