Balakrishna: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబుకు తోడుగా మొత్తం ఎన్టీఆర్ కుటుంబంపై తెరపైకి వస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన ప్రకటన చేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
చంద్రబాబు అరెస్టు, రిమాండ్ వ్యవహారంతో జనంలో ఎలాంటి స్పందన ఉందో లేదో తెలియదు గానీ ఎన్టీఆర్ కుటుంబం మాత్రం ముందుకొచ్చింది. ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. నిన్న ఎన్టీఆర్ కుటుంబీకులు చాలామంది రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని పరామర్శించారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ తెరపైకి వచ్చి మీడియాతో చాలా విషయాలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమౌతున్నాయి. తెరవెనుక ఏదో జరుగుతోందా అనే అనుమానాల్ని రేకెత్తిస్తోంది.
చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం అనేదే లేదని..కేవలం సృష్టించారని ఆరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలి కక్ష సాధింపులే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారంటూ దుయ్యబట్టారు. 16 నెలలు జైలులో ఉన్న జగన్..చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైలులో ఉంచాలనే దుగ్దతో పనిచేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారని విమర్శించారు. బావ చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారని చెప్పుకొచ్చారు.
బాలకృష్ణ ఓదార్పు యాత్ర
అదే సమయంలో ప్రజల కోసం తాను వస్తున్నాననే సంకేతాలిచ్చారు. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెబుతూనే భయపడవద్దని తానున్నానని అభయమిచ్చారు. తెలుగువాడి సత్తా చూపిద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పరిణామాలు తట్టుకోలేక మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామని బాలకృష్ణ హామీ ఇచ్చారు. అంతేకాదు..ఆ కుటుంబాల్ని త్వరలో పరామర్శిస్తానని చెప్పారు. ప్రతి కుటుంబాన్ని కలుస్తానన్నారు. మీ అందరి కోసం నేనున్నానని..మీ వద్దకు వస్తానని చెప్పారు.
బాలయ్య ప్రకటన వెనుక కారణాలు కూడా లేకపోలేదు. యువగళం పేరుతో నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్రకు అంతగా స్పందన లేకపోవడంతో పాటు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పెరుగుతున్న ఆదరణ కొద్దికాలంగా టీడీపీ వర్గాల్ని వేధిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ కావడం, బెయిల్ అంత త్వరగా వచ్చే అవకాశాల్లేకపోవడంతో బాలయ్యతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కొత్త ప్లానింగ్ అని కూడా కొందరంటున్నారు. బాలకృష్ణకు జనంలో ఉన్న ఆకర్షణ ఇందుకు ఉపయోగపడవచ్చని అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook