'కరోనా వైరస్' ఉద్ధృతంగా విస్తరిస్తున్నందున దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు ఒక్కొక్కరూ తమ వంతు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
మన్ కీ బాత్ లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు సామూహికంగా యుద్ధం చేయాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. ఆర్ధికంగా ఎదుగుతూనే కరోనా పీఛమణచాలని పిలుపునిచ్చారు. ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చామని చెప్పారు. ఐతే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు. గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే నడుచుకోవాలన్నారు.
సామాజిక దూరం కచ్చితంగా పాటించాల్సిందేనని ప్రధాని మోదీ తెలిపారు. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ప్రజలను కోరారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు కేసులు పెరుగుతున్న దృష్ట్యా గతంలో కంటే ఇప్పుడే ఇంకా ఎక్కువ అప్రమత్తత అవసరమని సూచించారు. కరోనాతో పోరాటం ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా గుర్తించాలని మోదీ కోరారు.
దేశవ్యాప్తంగా కరోనాను ఎదుర్కునేందుకు సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇది చాలా మంచి శుభపరిణామమని తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు స్టార్టప్స్ కూడా సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయన్నారు. ఇతర దేశాలను ఓసారి పరిశీలించినట్లయితే .. ఇండియాలో జరుగుతున్న సరికొత్త ఆవిష్కరణల సత్తా ఏంటో తెలుస్తుందని చెప్పారు. మన దేశ జనాభా .. మిగతా దేశ జనాభా కంటే ఎక్కువ అయినప్పటికీ.. కరోనా వైరస్ విస్తృతి మాత్రం తక్కువగా ఉందని మోదీ అన్నారు. దీనికి ప్రధాన కారణం మన దేశ ప్రజలు భిన్నంగా ఆలోచించడమేనని తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..