రామ్‌ జెఠ్మలానీ ముక్కుసూటి మనస్తత్వానికి ఇదే నిదర్శనం

రామ్‌ జెఠ్మలానీ ముక్కుసూటి మనస్తత్వానికి ఇదే నిదర్శం

Last Updated : Sep 9, 2019, 01:05 AM IST
రామ్‌ జెఠ్మలానీ ముక్కుసూటి మనస్తత్వానికి ఇదే నిదర్శనం

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్‌ జెఠ్మలానీ(95) ఇక లేరు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ జెఠ్మలానీ ఆదివారం ఉదయం 7:45 గంటలకు ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు మహేష్ జెఠ్మలానీ తెలిపారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామ్ జెఠ్మలానీ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ.. జెఠ్మలానీ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఏ విషయంపైనైనా తన మనసులో మాటను కుండబద్ధలు కొట్టినట్టు చెప్పే ధైర్యశాలిగా జెఠ్మలానీని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు జెఠ్మలానీ వ్యక్తిత్వంపై ప్రధాని మోదీ పలు ట్వీట్స్ చేశారు. 

1923 సెప్టెంబర్ 14న సింధ్‌ ప్రావిన్సులోని సిఖర్పూర్‌లో జన్మించిన రామ్ జెఠ్మలానీకి దేశంలోనే ప్రముఖ న్యాయవాదిగా పేరుంది. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఎన్నో కీలకమైన కేసులు వాదించిన ఆయన ఒకానొక దశలో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే న్యాయవాదిగా పేరు గడించారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ, న్యాయ శాఖ మంత్రిగా సేవలందించారు. బార్ కౌన్సిల్ చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. దేశంలో సంచలనం సృష్టించిన ఎన్నో కేసులను ఆయన ధైర్యంగా టేకప్ చేశారు.  

1959లో కేఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర సర్కార్ కేసు, స్టాక్ మార్కెట్ కుంభకోణంలో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్‌ల కేసు, అఫ్జల్ గురు ఉరిశిక్ష, జెస్సికా లాల్ మర్డర్ కేసు, మద్రాసు హైకోర్టులో రాజీవ్ గాంధీ హంతకుల కేసులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసునూ రామ్ జెఠ్మలానీ వాదించారు. 

రామ్ జెఠ్మలానీ ముక్కుసూటి మనస్తత్వం గురించి ఇంకా చెప్పాలంటే.. అరుణ్ జైట్లీ, అరవింద్ కేజ్రీవాల్ పరువు నష్టం కేసులో తన సాయం కోరినందుకు అరవింద్ కేజ్రీవాల్ తరపున సాటి బీజేపి నేత అరుణ్ జైట్లీపైనే కేసు వాదించారాయన. జెఠ్మలానీ మృతి నేపథ్యంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అరవింద్ కేజ్రీవాల్.. జెఠ్మలానీ లేని లోటు పూడ్చలేనిది అని ట్వీటర్ ద్వారా ఆవేదన వ్యక్తంచేశారు.

Trending News