బాలలను దొంగలుగా మార్చడమే.. ఆ గ్యాంగ్ లక్ష్యం..!

దేశ రాజధానిలో వీధిబాలలను నేరస్తులుగా మార్చడమే ఆ గ్యాంగ్ లక్ష్యం. బాల కార్మికులకు దొంగతనాలు నేర్పించి.. వారిని రాటుదేలిన పిక్ పాకెటిర్స్‌గా మార్చడమే ఆ ముఠా ధ్యేయం

Last Updated : May 31, 2018, 01:10 PM IST
బాలలను దొంగలుగా మార్చడమే.. ఆ గ్యాంగ్ లక్ష్యం..!

దేశ రాజధానిలో వీధిబాలలను నేరస్తులుగా మార్చడమే ఆ గ్యాంగ్ లక్ష్యం. బాల కార్మికులకు దొంగతనాలు నేర్పించి.. వారిని రాటుదేలిన పిక్ పాకెటిర్స్‌గా మార్చడమే ఆ ముఠా ధ్యేయం. ఢిల్లీలో ఏకంగా ఒక దొంగల స్కూలునే నడుపుతున్న ఆ గ్యాంగ్ గురించి ఇటీవలే బట్టబయలైంది. ఆ గ్యాంగ్ నడిపే రాజ్ కుమార్ అనే వ్యక్తి గురించి ఇప్పుడు పోలీసుల అన్వేషణ మొదలైంది.

వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో ఇదే గ్యాంగ్‌కు చెందిన ఓ బాలుడు తాను దొంగతనం చేసిన ఫోన్ నుండి పోలీసులకు కాల్ చేయడంతో ఈ ముఠా గురించి తెలిసింది. తమను హింసిస్తూ దొంగతనాలకు పురమాయిస్తున్నారని ఆ బాలుడు తెలియజేయడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చాలా చాకచక్యంగా వ్యవహరించి ఇదే గ్యాంగ్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. 

అలా అరెస్టు చేసినవారి నుండి పోలీసులు 40 వరకూ మొబైల్ ఫోన్లు, రూ.4 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. జువైనల్ చట్టంలోని పలు లోటుపాట్లను ఆసరాగా చేసుకొని రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ దందాను కొన్ని రోజుల నుండి నడుపుతున్నట్లు తెలుస్తోంది. జువైనల్ చట్టం ప్రకారం పెట్టీ కేసుల్లో పోలీసులకు చిక్కిన బాలలను 24 గంటల్లోనే విడిచిపెడతారు.

కనుక, ఈ విషయాన్ని తనకు అనువుగా మలుచుకున్న రాజ్ కుమార్ పేద పిల్లలను చేరదీసి వారికి చైన్ స్నాచింగ్‌తో పాటు పిక్ పాకెటింగ్‌లో శిక్షణ ఇవ్వడం నేర్పిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఇలాంటి గ్యాంగ్‌లపై రాజధాని పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

Trending News