న్యూఢిల్లీ: కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి నేతృత్వంలో దేశంలోని రహదారులు, రవాణా శాఖా పరంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసించి తన నిష్పక్షపాత వైఖరిని చాటుకున్నారు యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ. గురువారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నితిన్ గడ్కరి శాఖకు సంబంధించి రెండు ప్రశ్నలు చర్చకొచ్చాయి. రెండు ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇచ్చిన నితిన్ గడ్కరి.. జరుగుతున్న అభివృద్ధిని సభలో వెల్లడించారు. గడ్కరి సమాధానం విన్న బీజేపీ ఎంపీలు తమ ముందున్న బల్లలు చరుస్తూ నితిన్ గడ్కరిని ప్రశంసించారు. వారి మధ్యలోంచి లేచినిలబడిన మహరాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ గణేష్ సింగ్.. ''మంత్రి నితిన్ గడ్కరి గారి హయాంలో జరిగిన అభివృద్ధి సభలోని సభ్యులంతా ప్రశంసించదగినది'' అని స్పీకర్ సుమిత్రా మహజన్కి నివేదించారు.
ఇదిలావుండగానే మరోవైపు నితిన్ గడ్కరి వివరణ ఇస్తున్నంతసేపు ఆయన సమాధానాలను ఓపిగ్గా విన్న సోనియా గాంధీ... ఆయన సమాధానం చెప్పడం పూర్తికాగానే తన ముందున్న బల్లను గట్టిగా చరుస్తూ హర్షం వ్యక్తంచేశారు. సోనియా గాంధీ హర్షం వ్యక్తంచేయడం చూసిన కాంగ్రెస్ ఎంపీలు అంతా బల్లలు చరుస్తూ ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తారు.