సల్మాన్‌కి VIP ట్రీట్‌మెంట్ లేదు.. నేలపైనే నిద్ర : డీఐజీ విక్రమ్ సింగ్

సల్మాన్ ఖాన్ ఇంకా ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్ల కోసం విజ్ఞప్తి చేయలేదని అన్నారు జోధ్‌పూర్ డీఐజీ (జైల్స్) విక్రమ్ సింగ్.

Last Updated : Apr 6, 2018, 02:03 PM IST
సల్మాన్‌కి VIP ట్రీట్‌మెంట్ లేదు.. నేలపైనే నిద్ర : డీఐజీ విక్రమ్ సింగ్

సల్మాన్ ఖాన్ ఇంకా ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్ల కోసం విజ్ఞప్తి చేయలేదని అన్నారు జోధ్‌పూర్ డీఐజీ (జైల్స్) విక్రమ్ సింగ్. సల్మాన్ ఖాన్‌ని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకి తరలించిన అనంతరం అక్కడి పరిస్థితి గురించి విక్రమ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ... " సల్మాన్ ఖాన్‌కి ఖైదీ నెంబర్ 106 కేటాయించడం జరిగింది" అని తెలిపారు. " సల్మాన్ జైలుకి రావడంతోనే మొదటిగా అతడికి పలు వైద్య పరీక్షలు నిర్వహించాం. తొలుత సల్మాన్‌కి హై బీపీ వున్నట్టు తేలింది. కానీ క్రమక్రమంగా అది నార్మల్ అవుతూ వచ్చింది. ఖైదీలు జైలుకి వచ్చిన మొదట్లో జైలులో అడుగు పెడుతున్నాం అనే భయంతోనో, కంగారుతోనో బీపీ పెరగడం అనేది సాధారణ విషయమే" అని డీఐజీ విక్రమ్ సింగ్ చెప్పారు. " సల్మాన్ ఖాన్ పర్సనల్ మేనేజర్ అతడి కోసం దుస్తులు, పలు తినుబండారాలు తీసుకొచ్చారు. దుస్తులని మాత్రమే అనుమతించాం. నియమనిబంధనల దృష్ట్యా తినుబండారాలను అనుమతించలేదు " అని డీఐజీ స్పష్టంచేశారు.

' సల్మాన్ ఖాన్ ప్రస్తుతానికి కేవలం మంచి నీరు తప్ప ఇంకా ఏమీ తీసుకోలేదు. ఆ మంచి నీరు కూడా ఇక్కడ అందరికీ సరఫరా చేసేవే తప్ప ప్రత్యేకించి బాటిల్ నీళ్లు కాదు. వాస్తవానికి సల్మాన్ ఖాన్ నుంచి ఇంకా ప్రత్యేకమైన విజ్ఞప్తులు ఏవీ రాలేదు' అని తేల్చిచెప్పిన డీఐజీ.. ఇవాళ రాత్రికి భోజనంలోకి జైలు మెను ప్రకారం చనా పప్పు, క్యాబేజీ, రేపు ఉదయం యధావిధిగా అల్పాహారం, ఛాయ్, ఆ తర్వాత కాసేపటికి ఏదో ఓ సమయంలో కిచిడి వడ్డించడం జరుగుతుందని అన్నారు. 

సాధారణ ఖైదీల మాదిరిగానే సల్మాన్ కూడా కఠిక నేలపైనే నిద్రించాల్సి వుంటుంది. అతడికి అందరి తరహాలోనే నాలుగు బ్లాంకెట్స్, భోజనానికి అవసరమైన పాత్రలు అందించడం జరుగుతుంది అని డీఐజీ వెల్లడించారు.

Trending News