పంజాబ్, కర్నాటక రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ తక్కువ ధరకు లభ్యం కానుందని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) హిమాచల్ ప్రదేశ్ ఇంచార్జ్ రజ్నీ పాటిల్ ఆదివారం వెల్లడించారు. పెట్రోల్ ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలైన పంజాబ్, కర్ణాటక ముఖ్యమంత్రులకు ఇప్పటికే ఆదేశించారని పాటిల్ ఒక ప్రశ్నకు బదులిచ్చారు.
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (హెచ్ పీసీసీ) అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) నాయకుడు ముఖేష్ అగ్నీహోత్రిలతో కలిసి రజ్నీ పాటిల్ మీడియాతో మాట్లాడారు. వీరభద్ర సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై 2 శాతం వ్యాట్‌ను హిమాచల్ ప్రదేశ్‌లో తగ్గించారన్న విషయాన్ని పాటిల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడంతో సోమవారం కాంగ్రేస్ పార్టీ పిలుపునిచ్చిన భారత్ బంద్ హిమాచల్ ప్రదేశ్‌లో శాంతియుతంగా జరుగుతుందని అన్నారు.
మోదీ ప్రభుత్వం హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని రజ్నీ పాటిల్ మండిపడ్డారు. గత యూపిఎ ప్రభుత్వంలో ముడిచమురు ధరలు ఎక్కువగా ఉన్నా.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉన్నాయని ఆవిడ అన్నారు.
అయితే, ముడిచమురు ధరలతో పోలిస్తే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ప్రస్తుత పాలనలో చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఆవిడ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ది చెప్తారన్నారు.