కేంద్ర బడ్జెట్ 2020-2021 ఉద్యోగులకు, చిన్న వ్యాపారాస్తులకు ఆశాజనకంగా నిలిచింది. ముందుగా ఊహించిన విధంగానే ఆదాయపు పన్ను శాతంలో భారీగా కాకపోయినా. . కొంత మేర లాభం కనిపించింది. ఆదాయపు పన్ను శాతాన్ని కాస్త తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు.
వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించే వారికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాలు కురిపించారు. 2019 ఆర్ధిక సంవత్సరం వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించే వారిలో 2.5 లక్షల నుంచి 5 లక్షల ఆదాయం ఉన్న వారి నుంచి 5 శాతం పన్ను వసూలు చేసే వారు. ఇప్పుడు కూడా ఈ ఆదాయ పరిమితితోపాటు పన్నును ఆర్ధిక మంత్రి అలాగే ఉంచారు. వాటిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఐతే ఐదు లక్షల ఆదాయం పైబడి ఉన్న వారు ఇప్పటి వరకు 20 శాతం పన్ను చెల్లిస్తున్నారు. ఐతే కొద్దిపాటి శ్లాబ్ మార్పుల ద్వారా కొత్త ఆదాయ పన్ను శాతాలను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గతంలో 5 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం ఉన్న వారికి 20 శాతం ఆదాయ పన్ను విధించే వారు. ఈ శ్లాబును ఆమె రెండు శ్లాబులుగా విడగొట్టారు. 5 లక్షల ఆదాయం నుంచి 7.5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఇప్పటి నుంచి 10 శాతం పన్ను వసూలు చేస్తారు. అలాగే 7.5 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం ఉన్న వారి నుంచి 15 శాతం ఆదాయ పన్నును వసూలు చేస్తారు. గతంలో ఈ శ్లాబు వారు 20 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. దీన్ని 5 శాతం తగ్గించడం విశేషం. మరోవైపు 10 లక్షల నుంచి 12.5 లక్షల ఆదాయం ఉన్న వారి నుంచి 20 శాతం పన్ను వసూలు చేస్తారు. గతంలో ఈ శ్లాబులో ఉన్న వారి నుంచి 25 శాతం ఆదాయ పన్ను వసూలు చేసేవారు. 12.5 లక్షల నుంచి 15 లక్షల ఆదాయ పరిమితి శ్లాబులో ఉన్న వారి నుంచి 25 శాతం ఆదాయపన్ను వసూలు చేస్తారు. గతంలో ఈ శ్లాబులో ఉన్న వారు 30 శాతం పన్ను చెల్లించేవారు. 15 లక్షల పైబడి ఆదాయం ఉన్న వారు గతంలో ఉన్న విధంగానే 30 శాతం ఆదాయ పన్ను చెల్లించాలి.
వివాద్ సే విశ్వాస్ స్కీమ్
ఆదాయ పన్ను ఎగవేతకు అవకాశం లేకుండా సరికొత్త విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ పేరుతో ఈ నూతన విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఇందులో గతంలో ఆదాయ పన్ను బాకీ ఉన్నవారి నుంచి కేవలం పన్ను మొత్తాన్నే వసూలు చేస్తారు. వారిపై ఎలాంటి జరిమానాలు, వడ్డీలు విధించారు. ఐతే 2020 మార్చి 31లోగా చెల్లించే వారికి ఈ పథకం వర్తింస్తుందన్నారు.