స్ఫూర్తిదాయకం.. ఆ అమరవీరుల జీవితం..!

భగత్ సింగ్.. ఆ దేశభక్తుని పేరు వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయని అనడంలో అతిశయోక్తి లేదు.

Last Updated : Mar 23, 2018, 04:14 PM IST
స్ఫూర్తిదాయకం.. ఆ అమరవీరుల జీవితం..!

భగత్ సింగ్.. ఆ దేశభక్తుని పేరు వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయని అనడంలో అతిశయోక్తి లేదు. నవతరానికి ఆయన గాథ ఎంతో స్ఫూర్తినిస్తుందనడంలో కూడా సందేహం లేదు. 1907 సెప్టెంబరు 28వ తేదిన లాయర్ పూర్ జిల్లా బంగాలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించిన భగత్ సింగ్, 12 ఏళ్ళకు జలియన్ వాలా బాగ్ ఉదంతంలో బ్రిటీషర్లు ఎందరో అమాయకులను అగ్నికి ఆహుతి చేయడం చూసి రగిలిపోయాడు. 

అందుకే 14 ఏళ్ళ ప్రాయంలోనే మహాత్ముని పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి వచ్చాడు. అయితే ఆ ఉద్యమం మధ్యలోనే ఆగిపోవడం తనకు నచ్చలేదు. అందుకే భారత్ సేన పేరుతో తానే ఒక సాయుధ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1928లో సైమన్ కమీషను వచ్చి తమ అరాచకాలతో ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నప్పుడు.. వారి చర్యలను వ్యతిరేకించిన వారిలో భగత్ సింగ్ కూడా ఒకరు. వారిపై పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ ప్రభావం ఉండేది. సైమన్ కమీషను బలగాలతో జరిగిన ఘర్షణలో లాలా లజపతి రాయ్ చనిపోవడంతో.. భగత్ సింగ్‌లో ఆవేశం కట్టలు తెంచుకుంది. తన సహచరులతో కలిసి బ్రిటీష్ అధికారి శాండర్స్‌ను తుదముట్టించాడు. 

శాండర్స్‌ని హత్య చేశాక.. భారత ప్రజలకు హాని కలిగించే రెండు ప్రధాన బిల్లులను సభలో ప్రవేశబెట్టాలని భావించింది బ్రిటీష్ ప్రభుత్వం. అదే సభలో భగత్ సింగ్ తన అనుయాయులతో కలిసి ప్రేక్షకుల గ్యాలరీ నుండి ప్రాణాంతకం కాని రెండు బాంబులు విసిరారు. తర్వాత ప్రభుత్వ వ్యతిరేకతను చాటే కరపత్రాలను గాల్లోకి విసిరారు.  ఆ ఘటన తర్వాత వారిని బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. జైల్లో ఉండగా.. భగత్ సింగ్ తన ఆలోచనలను కవితల ద్వారా వ్యక్తం చేసేవారు. 

శాండర్స్ హత్యకేసులో భగత్ సింగ్‌తో పాటు 13 మంది విప్లవకారులపై కేసులు నమోదు చేయబడ్డాయి. ఆ కేసును పూర్తిగా దర్యాప్తు చేసి భగత్ సింగ్‌తో పాటు అతని సహచరులు రాజగురు, సుఖ్ దేవ్‌‌లకు కూడా ఉరి శిక్ష విధించింది కోర్టు. ఉరిశిక్ష తమకు పడిందన్న వార్త వినగానే భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు కూడా విచారించక.. ఒకరిని చూసి ఒకరు నవ్వుకోసాగారు. భరతమాత కోసం ప్రాణాలు అర్పించే అవకాశం వచ్చినందుకు సంతోషించారు. 

"ఇంక్విలాబ్ జిందాబాద్" నినాదంతో జైలును హోరెత్తించారు. అయితే సురేంద్ర మోహన్ ఘోష్ వంటి అగ్ర నాయకులు భగత్ సింగ్‌తో పాటు అతని సహచరులకు పడ్డ ఉరిశిక్షలను రద్దు చేయాలని వైస్రాయ్‌కి, మహాత్మాగాంధికి విజ్ఞప్తి చేశారు. అయినా సర్కారు వినలేదు. కొందరు అపీల్‌ ఫైల్ చేయగా దానిని డిస్మిస్ చేశారు. మార్చి 23, 1931 తేదిన వీరిని షెడ్యూల్ సమయానికి ముందే బ్రిటీష్ ప్రభుత్వం ఉరితీసింది. ఉరిశిక్ష పడే నాటికి భగత్ సింగ్ వయసు 23 ఏళ్లు మాత్రమే.

Trending News