తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలపడం చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంగా ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. అలాగే ప్రత్యేక హోదా విషయంపై కూడా కంభంపాటి మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో ప్రత్యేక హోదాను పొందుపరచపోవడానికి కారణం కాంగ్రెస్ అని ఆయన తెలిపారు.
ప్యాకేజీ ఇస్తామని చెప్పినా కూడా తెలుగుదేశం ఎందుకు అర్థం చేసుకోవడం లేదో తెలియడం లేదని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా తొలుత ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన విషయాన్ని కంభంపాటి గుర్తుచేశారు. అలాగే నిధులు విషయానికి వస్తే తాము 14వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారమే నడుచుకుంటున్నామని కంభంపాటి తెలిపారు. రూ.17500 కోట్లను కేంద్రం ఇచ్చిందని కూడా ఆయన గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని అందిస్తూనే ఉన్నారని కంభంపాటి తెలిపారు.
కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్ లాంటి విషయాలు అన్నీ కూడా కేంద్రం లిస్టులో ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని కంభంపాటి అన్నారు. టీడీపీ, బీజేపీతో కలసి ముందుకు వెళ్లినా లేకపోయినా కూడా తమ అభిమతం మాత్రం ఆంధ్ర ప్రజలకు మేలు చేయాలనే అని కంభంపాటి తెలిపారు.
14వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటు భర్తీ చేయాలని చెప్పిందని.. వారి సూచనల ప్రకారమే కేంద్రం నిధులిస్తుందని కంభంపాటి గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కావాలంటే తాము సిద్ధమని.. అకౌంట్ నెంబరు ఇప్పుడు చెబితే.. సోమవారం నాటికల్లా డబ్బులు పంపించే ఏర్పాటు కేంద్రం చేయగలదని కంభంపాటి తెలిపారు. అంతేకానీ.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వారితో కలిసి వెళితే ఎన్టీఆర్ ఆత్మ క్షోభించడం ఖాయమని అన్నారు.
ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది: కంభంపాటి