మోకరిల్లి నివాళి అర్పించిన కాంగ్రెస్ ఎంపీ.. వైరల్‌గా మారిన ఫోటోలు

మాజీ ప్రధానికి మోకరిల్లి నివాళి అర్పించిన కాంగ్రెస్ ఎంపీ.. వైరల్‌గా మారిన ఫోటోలు

Last Updated : Aug 18, 2018, 11:16 AM IST
మోకరిల్లి నివాళి అర్పించిన కాంగ్రెస్ ఎంపీ.. వైరల్‌గా మారిన ఫోటోలు

మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజ్‌పేయి పార్థివదేహానికి ఓ కాంగ్రెస్ ఎంపీ మోకరిల్లి నివాళి అర్పిస్తుండగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాజ్‌పేయి అంటే పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించే మహా నేత అని అందరికీ తెలిసిందే. ఇక బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ నేతల్లో చాలామందికి వాజ్‌పేయితో మంచి సాన్నిహిత్యం ఉంది. అందులో వాజ్‌పేయి ఆశీస్సులతో పైకొచ్చిన వాళ్లు కొందరైతే, వాజ్‌పేయితో కలిసి పనిచేసిన వాళ్లు ఇంకొందరు. కానీ బీజేపీకి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఇలా వాజ్‌పేయి పార్థివదేహం వద్ద మోకరిల్లి నివాళి అర్పించడంతోపాటు కన్నీళ్లు పెట్టుకున్న వైనం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకీ ఆ కాంగ్రెస్ నేత ఎవరో కాదు.. నిత్యం ప్రజా సమస్యలపై సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీపై పోరాటం జరుపుతున్న యువ నేత, మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన జ్యోతిరాదిత్య సింధియానే. వాజ్‌పేయికి కన్నీటి నివాళి అర్పించిన విషయాన్ని తానే ట్విటర్ ద్వారా తెలియజేశారు.

 

 

అవును, శుక్రవారం ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన జ్యోతిరాదిత్య సింధియా అక్కడే వాజ్‌పేయి పార్థివదేహం ముందు మోకరిల్లి కన్నీటి నివాళి అర్పించారు. అందుకు కారణం తాను ప్రతిపక్ష పార్టీకే చెందిన ఎంపీనే అయినప్పటికీ.. వాజ్‌పేయితో తన కుటుంబానికి దశాబ్ధాల తరబడి మంచి అనుబంధం ఉండటమే. జ్యోతిరాధిత్య సింధియా తండ్రి అయిన సీనియర్ కాంగ్రెస్ నేత, దివంగత మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియాకు వాజ్ పేయితో మంచి అనుబంధం ఉండేది. 

1971 నుంచి ఓటమి అనేది లేకుండా 9 పర్యాయాలు పార్లమెంట్‌కి ఎన్నికైన మాధవరావు సింధియా కాంగ్రెస్‌లోకి రాకముందు జన్ సంఘ్ నుంచి రాజకీయాలు మొదలుపెట్టడమే సింధియాకు వాజ్‌పేయికి మధ్య అనుబంధం ఏర్పడటానికి కారణమైంది అంటుంటారు ఆ ఇద్దరి గురించి తెలిసిన వాళ్లు. 19681972 మధ్య కాలంలో అటల్ బిహారి వాజ్‌‌పేయి జన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడిగా సేవలు అందించిన సంగతి తెలిసిందే. అలా సింధియాతో వాజ్‌పేయి కుటుంబానికి ఎప్పుడూ సత్సంబంధాలే ఉండేవి.

Trending News