భారత వైమానిక దళం దాడులు విజయవంతం : భారత్

భారత వైమానిక దళం దాడులు విజయవంతం : భారత్

Last Updated : Mar 9, 2019, 05:43 PM IST
భారత వైమానిక దళం దాడులు విజయవంతం : భారత్

న్యూఢిల్లీ: తమ దేశం నూతన ఆలోచనా విధానంతో ముందుకు వెళ్తోంది అని చెబుతున్న పాకిస్తాన్.. ఆ దేశ భూభాగంపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులపై కఠిన వైఖరి అలంభించినప్పుడే ఆ మాటలను నిజం చేసుకున్నట్టు అవుతుంది అని భారత విదేశీ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. శనివారం భారత విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ''భారత వాయుసేనకు చెందిన రెండో యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ కూల్చేసిందని చెబుతున్న మాట వాస్తవమే అయితే, ఆ యుద్ధ విమానాన్ని కూల్చిన వీడియోను అంతర్జాతీయ మీడియాకు ఎందుకు విడుదల చేయలేదు'' అని పాకిస్తాన్‌ను ప్రశ్నించారు. అదే సమయంలో భారత్‌పై దాడికి వచ్చిన పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని భారత వాయుసేన వింగ్ కమాండర్ పైలట్ అభినందన్ వర్థమాన్ కూల్చేశారనడానికి తమ వద్ద ప్రత్యక్షసాక్షులతోపాటు ఇతర ఆధారాలు కూడా ఉన్నాయని కుమార్ తెలిపారు. అంతేకాకుండా భారత్‌పై దాడికి ఎఫ్-16 యుద్ధ విమానాన్ని ఉపయోగించడం అనేది అమెరికా-పాకిస్తాన్ ఒప్పందాలకు విరుద్ధమేనా కాదా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాల్సిందిగా భారత సర్కార్ అమెరికాను కూడా కోరిందని కుమార్ పేర్కొన్నారు. 

ఓవైపు పుల్వామా దాడికి తామే బాధ్యత వహిస్తున్నాం అని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాన్ ఇంకా ఆ ఉగ్రవాద సంస్థనే వెనకేసుకు రావడం సిగ్గుచేటని కుమార్ పాకిస్తాన్‌ను ఎద్దేవా చేశారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత వాయుసేన జరిపిన దాడుల లక్ష్యం నెరవేరిందని ఈ సందర్భంగా కుమార్ స్పష్టంచేశారు.

Trending News