హైదరాబాద్: అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుఫాన్‌కు క్యార్రా అని నామకరణం చేశారు. రానున్న 24 గంటల్లో క్యార్రా తుఫాను తీవ్రరూపం దాల్చుతుందని, తుఫాన్ ప్రభావంతో శనివారం గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతోపాటు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న ఐదు రోజులపాటు క్యార్రా తుఫాన్ ప్రభావంతో దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో శనివారం పలుచోట్ల భారీ వర్షాలు కురవనుండగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇదిలావుంటే, ఈ తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గోవాలో బయటినుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య అధికంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
పలు రాష్ట్రాలను వెంటాడుతున్న క్యార్రా !