రజినీకాంత్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి: కమల్ హాసన్

రజినీకాంత్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి: కమల్

Last Updated : Jun 4, 2018, 11:38 PM IST
రజినీకాంత్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి: కమల్ హాసన్

తూత్తుకుడి ఘటనను ప్రస్తావిస్తూ సమస్యల పరిష్కారానికి ఆందోళనకారులు రోడ్లెక్కితే తమిళనాడు స్మశానంగా మారుతుందని నటుడు రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలను మక్కళ్ నీతి మయ్యమ్ (సెంటర్ ఫర్ పీపుల్స్ జస్టిస్) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తప్పుబట్టారు. ఆందోళనకారులను సంఘ వ్యతిరేకులుగా భావిస్తే తానూ సంఘ వ్యతిరేకినేనని, ఆందోళనల ద్వారా హింస తలెత్తితే.. హింసను తగ్గించాలే తప్ప ఉద్యమాన్ని నీరుగార్చకూడదన్నారు. రజినీకాంత్ గత నెల మే 30న తూత్తుకుడి పర్యటనలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న స్టెరిలైట్ బాధితులను పరామర్శించిన సంగతి తెలిసిందే.

రజినీ వ్యాఖ్యలపై పుదుచ్చేరి సీఎం వి.నారాయణ స్వామి కూడా మండిపడ్డారు. రజినీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని.. ఆరోపణలు రుజువులతో వెల్లడించాలని అన్నారు. మరోవైపు 'కావేరీ జలాల విషయంలో రజినీ వ్యాఖ్యలు నన్ను బాధించాయి' అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

తూత్తుకుడి ఫ్యాక్టరీ మూసేయాలని నిర్వాసితులు 99 రోజులుగా ఆందోళలను నిర్వహిస్తూ వచ్చారు. వందవ రోజు మే 22న ఆందోళనలు హింసగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. దీనిపై స్థానిక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అధికార ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఆ కంపెనీని మూసేయాలని.. లేకపోతే మరింత ఉద్యమిస్తామని హెచ్చరించాయి. ఆందోళనలకు దిగివచ్చిన తమిళ సర్కార్ స్టెరిలైట్ కంపెనీ మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. 

Trending News