తమిళనాడులో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. సూపర్ స్టార్లు కమల్ హాసన్, రజినీకాంత్ కొత్త పార్టీలతో ప్రజల ముందుకు రానుండటంతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కనున్నాయి. ఇద్దరూ కూడా 'రాజకీయాల్లో మార్పు' నినాదంతో ముందుకు వస్తున్నందున జతకడతారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే హార్వార్డ్ యూనివర్శిటీలో జరిగిన వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కమల్.. దీనిపై స్పందించారు.
'రజినీ రాజకీయాల్లో 'కాషాయం' జోడింపు ఉంటుందనే మాట వినిపిస్తోంది. అదే నిజమైతే ఆయనతో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదు. రజినీ నాకు మంచి స్నేహితుడే...కానీ మిత్రత్వం వేరు, రాజకీయాలు వేరు' అని కమల్ చెప్పారు. ఎన్నికల్లో చేతులు కలపాల్సి వస్తే.. తాను, రజినీ తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంటుందని ఇటీవలే కమల్ వ్యాఖ్యానించిన విషయం విదితమే..!
naalainamadhe.maiam.com వెబ్సైట్ గురించి మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే విధంగా ఇది రూపకల్పన చేయబడిందన్నారు. "ఆరోగ్యం, విద్య, పర్యావరణం, వ్యవసాయం, ఫైనాన్స్, అనేక రంగాల విషయాలలో ప్రజలు తమను తాము నమోదు చేసుకోవచ్చు" అని ఆయన చెప్పారు.