అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గురువారం నాడు వారం రోజుల్లో ఎప్పుడూ లేనంత కనిష్టానికి పడిపోయాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు, పెరిగిన బంగారం నిల్వలు, డాలర్ విలువ ఇందుకు కారణాలు అయ్యుంటాయని బులియన్ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రానున్న డిసెంబర్లో కానీ లేదా ఆ తర్వాత 2019లో కానీ బంగారం పెట్టుబడులపై వడ్డీ రేట్లు పెరుగుతాయా లేదా అనే అంశంపై సరైన స్పష్టత లేకపోవడం కూడా ఈ పరిణామానికి ఓ కారణమైందంటున్నాయి మార్కెట్ వర్గాలు. డిసెంబర్లో జరిగే సమావేశం తర్వాతే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని, అప్పటివరకు వేచిచూడక తప్పదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో తగ్గుదల నమోదైనప్పటికీ, దురదృష్టవశాత్తుగా రూపాయి విలువ బలహీనపడటంతో భారత్ లోకి దిగుమతి అవుతున్న బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేకపోవడం గమనార్హం. జీ బిజినెస్ వెల్లడించిన ఓ కథనం ప్రకారం బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి రూ.32,400 గా పలికింది.
ఇక వెండి ధరల విషయానికొస్తే, రూ.300 తగ్గుదల అనంతరం కిలో వెండి ధర రూ.39,000కు చేరుకుంది.
అమెరికాలో ఇవాళ ఒక ఔన్స్ బంగారం ధర 0.3% పడిపోయి 1,221.70 డాలర్లకు చేరుకుంది. ఒక ఔన్స్ 28.3495 గ్రాములకు సమానం.