తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కాదు.. కమీషన్ మాన్: సినీ నటి కుష్బూ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కాదని.. కమీషన్ మాన్ అని సినీ నటి, కాంగ్రెస్ నేత కుష్బూ వ్యాఖ్యలు చేశారు. 

Last Updated : Nov 20, 2018, 04:11 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కాదు.. కమీషన్ మాన్: సినీ నటి కుష్బూ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కాదని.. కమీషన్ మాన్ అని సినీ నటి, కాంగ్రెస్ నేత కుష్బూ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఏమీ దక్కలేదని ఆమె అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్  తరఫున ఆమె జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఆ హోదాలో ఆమె తెలంగాణ సీఎంపై విమర్శనాస్త్రాలు సంధించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాటకు కట్టుబడి లేకుండా పోయారని.. ఆయనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారని కుష్బూ అన్నారు. ఇది అధర్మ పాలన కాదా? అని ఆమె ప్రశ్నించారు.

ఒక రకంగా చూసుకుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం అని.. తమ క్యాబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించలేని ప్రభుత్వం ఎన్నికలలో గెలిస్తే మాత్రం వారికి ఏదో చేస్తాదన్నది భ్రమ అని ఆమె అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రతీ ప్రాజెక్టు పనికి కూడా 6 శాతం కమీషన్ తీసుకుంటారని.. ఇది అందరికీ తెలిసిన విషయమేనని కుష్బూ తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని ఆమె అన్నారు. 

బంగారు తల్లి పథకానికి పేరు మార్చి కళ్యాణలక్ష్మీ అని టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తపేరు పెట్టిందని కుష్బూ అన్నారు. వరంగల్‌లో శ్రుతిని బూటకపు ఎన్ కౌంటర్ చేసిందీ టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆమె తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కుష్బూపై టీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో మండిపడ్డారు. తెలంగాణ పరిస్థితులను తెలుసుకోకుండా ఆమె మాట్లాడకూడదని.. ఆమెకు తెలంగాణపై అవగాహన లేదని వారు అంటున్నారు. పర భాషా నటికి కేసీఆర్‌ని అనే తాహతు లేదని కూడా పలువురు కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు.

Trending News