ఆసన్‌సోల్: ఎన్నికలు జరుగుతుండగానే పోలింగ్ బూత్‌లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి, పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌సోల్ లోక్ సభ స్థానం బీజేపి అభ్యర్థి బాబుల్ సుప్రియోను ప్రశ్నించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఆసన్‌సోల్‌లోని 199వ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించిన బాబుల్ సుప్రియో అక్కడ ఓ సీనియర్ ఐపిఎస్ అధికారిని, మరో పోలింగ్ ఏజెంట్‌పై బెదిరింపులకు పాల్పడిన నేరం కింద అతడిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఇసి తమ ఆదేశాల్లో పేర్కొంది.
ఇదిలావుంటే, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సైతం సదరు సీనియర్ ఐపిఎస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారి తనను వేధించి అభ్యంతరకరంగా ప్రవర్తించారని బాబుల్ సుప్రియో తన ఫిర్యాదులో పేర్కొన్నారు.